telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

జైలు నుంచి తప్పించుకున్న నేరస్థుడు… 17 ఏళ్ల తరువాత ఇలా గుహలో…!?

china

జైలు నుంచి తప్పించుకెళ్లిన ఓ ఖైదీ 17 ఏళ్ల తర్వాత పోలీసులకు పట్టుబడిన ఘటన చైనాలో జరిగింది. జైలు నుంచి పారిపోయిన తరువాత సదరు వ్యక్తి పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అతడి ఊరికి సమీపంలోని కొండప్రాంతంలోగల ఒక చిన్న గుహలో 17 ఏళ్లు బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా అక్కడే ఉండడం గమనార్హం. వివరాల్లోకి వెళితే… సాంగ్ జియాంగ్ (63) అనే వ్యక్తిని 2002లో మనుషుల అక్రమరవాణా కేసులో అరెస్ట్ చేసి కటకటాల్లో పెట్టారు. కానీ జియాంగ్ అదే ఏడాది జైలు నుంచి చాకచక్యంగా తప్పించుకున్నాడు. ఇక అప్పటి నుంచి తప్పించుకు తిరుగుతున్న అతడి కోసం పోలీసులు వెతకని చోటు అంటూ లేదు. ఎంత వెతికిన పోలీసులకు జియాంగ్ ఆచూకీ మాత్రం దొరకలేదు. ఈ క్రమంలో గత నెల జియాంగ్ స్వస్థలo యూన్నన్ ప్రొవిన్స్‌లో అతడికి సంబంధించిన చిన్న ఆధారం పోలీసులకు దొరికింది. ఆ ఆధారంతో అతడి కోసం మళ్లీ పోలీసులు అన్వేషణ మొదలెట్టారు. అటవీ ప్రాంతంలో జియాంగ్ తలదాచుకున్నాడనే ప్రాథమిక సమాచారంతో పోలీసులు డ్రోన్ సాయంతో ఆ అడవి మొత్తాన్ని జల్లెడ పట్టారు. దాంతో వారికి దట్టమైన చెట్ల మధ్యలో ఒక స్టీల్ ప్లేట్ మెరుపు కనిపించింది. వెంటనే డ్రోన్‌ను దగ్గరకు తీసుకెళ్లి పరిశీలించగా ఒక గుహ ప్రవేశ మార్గం వద్ద చెత్త, శిథిలాలు కనిపించాయి. దాంతో యాంగ్షన్ పోలీసులు ఆ గుహలో ఎవరో నివసిస్తున్నారనే అనుమానం వచ్చింది. వెంటనే గుహ వద్దకు వెళ్లారు. తీరా అక్కడికెళ్లి చూస్తే గుహలో జియాంగ్ తలదాచుకొని ఉండడం పోలీసులు గుర్తించారు. అతడు గుర్తుపట్టలేని విధంగా జుట్టు చెదిరిపోయి, మాట్లాడలేని స్థితిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. గుహలో జియాంగ్ కేవలం రెండు చదరపు అడుగుల స్థలంలో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 ఏళ్లు నివసించినట్లు పోలీసులు పేర్కొన్నారు. విచారణలో తాను దగ్గరలోని కాలువల నుంచి నీరు తెచ్చుకుని చిన్న మంటలపై వంటలు చేసుకున్నట్లు జియాంగ్ తెలిపాడని పోలీసులు పేర్కొన్నారు.

Related posts