telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ

అవినీతి ఆరోపణలతో ఈపీడీసీఎల్ ఎండీ రాజీనామా!

EPDCL CMD HJ Dora resigned
ఆంధ్రప్రదేశ్‌ తూర్పు ప్రాంత విద్యుత్‌ పంపిణీ సంస్థ  (ఈపీడీసీఎల్) లో భారీ వినీతి చోటుచేసుకోవడంతో ఆ సంస్థ సీఎండీ హెచ్‌వై. దొర పదవి నుంచి తప్పుకున్నారు. ఇంకా పదవీకాలం ఏడు నెలలుండగానే ఆయన నిష్క్రమించారు. ఈపీడీసీఎల్‌ ఉద్యోగులు, ఇంజినీర్ల బదిలీల్లో అవినీతి, పక్షపాత వైఖరితో వ్యవహరిస్తారన్న ఆరోపణల్లో ఆయన చిక్కుకున్నారు.2016లో కవర్డ్ కండక్టర్ల టెండర్ల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని, ఈపీడీసీఎల్‌లోనూ ఇదే తరహా అవినీతి చోటు చేసుకున్నట్టు ట్రాన్స్‌కో విజిలెన్స్ విచారణలో తేలింది. ఇంకా సబ్‌స్టేషన్ల నిర్మాణం, వైర్లు మార్చడం, అవసరం లేకపోయినా పనులు సృష్టించి నిధులు వెచ్చించడం వంటి ఆరోపణలు ఉన్నాయి. 
సీఎండీ దొరతో పాటు ఎస్పీడీసీఎల్, ఈపీడీసీఎల్‌ పరిధిలోని సుమారు 20 నుంచి 30 మంది ఉన్నతాధికారులకు ఈ కుంభకోణంలో ప్రమేయం ఉన్నట్లు తేలింది. ఈ నేపథ్యంలో దొర గత శుక్రవారం తన పదవికి రాజీనామా సమర్పించగా  సోమవారం ప్రభుత్వం ఆమోదించింది. ఈ క్రమంలో దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ(ఎస్పీడీసీఎల్‌) సీఎండీ ఎంఎం నాయక్‌కు ఈపీడీసీఎల్‌ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్ ఆదేశాలు జారీ చేశారు.
హెచ్‌వై దొర ఏపీఎస్‌ఈబీలో 1978లో అసిస్టెంట్‌ ఇంజినీర్‌గా విశాఖలోనే ఉద్యోగ ప్రస్థానాన్ని ప్రారంభించారు.  2017 సెప్టెంబర్‌ 15న ఈపీడీసీఎల్‌ సీఎండీగా నియమితులయ్యారు. ఈయన పదవీకాలం 2018 సెప్టెంబర్‌తో ముగియాల్సి ఉన్న తరుణంలో ప్రభుత్వం ఆయన పదవీకాలాన్ని ఏడాదిపాటు పొడిగించింది. ఈ లెక్కన ఆయన వచ్చే సెప్టెంబర్‌ వరకు ఈ పదవిలో కొనసాగాల్సి ఉంది. ఇంతలో రాజీనామా చేయాల్సివచ్చింది.

Related posts