telugu navyamedia
తెలంగాణ వార్తలు

ఎంగిలి పూలతో బతుకమ్మకు స్వాగతం…

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక అయిన బతుకమ్మ పండగ నేటి నుంచి (బుధవారం) అంగరంగ వైభవంగా సందడి మొద‌లైంది. తెలంగాణ ఆడబిడ్డల సంబురం బతుకమ్మ పండుగ.. ఎంగిలిపూల వేడుకతో నేడు మొదలైంది.

ఆడబిడ్డలంతా తమ పుట్టిళ్లకు చేరుకుని తొమ్మిది రోజులపాటు బతుకమ్మ సంబురాలు చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఆడపడచుల రాకతో ప్రతి ఇంటా కోలాహలం మొదలైంది. చదువు పేరిట ఇంటికి దూరంగా వెళ్లిన వాళ్లంతా తమ ఊళ్లకు చేరుకున్నారు. బంధువులు, స్నేహితులతో రాష్ట్రంలోని పల్లెలన్నీ కళకళలాడుతున్నాయి.

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ వేడుకల్లో మొదటి రోజు ఎంగిలిపూలు. ఈ ఎంగిలి పూల బతుకమ్మ ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమికి ముందురోజు వచ్చే అమావాస్య రోజున ఎంగిలి పూల బతుకమ్మ పేరుతో ప్రారంభమై దుర్గాష్టమి రోజున సద్దుల బతుకమ్మ పేరుతో ముగుస్తుంది. బాలారిష్టాలు, కలరా, మలేరియా, ప్లేగు వంటి మహమ్మారి రోగాల నుండి పిల్లా పాపలను, కరువు కాటకాల నుండి ప్రజలను కాపాడి బతుకును ఈయమ్మా అని ప్రజలు ప్రకృతి గౌరీని తమ సాధారణ ఆటపాటలతో పూజించే వేడుకే బతుకమ్మ పండుగ.

Bathukamma: Bathukamma: A floral ode to feminity | Events Movie News -  Times of India

తెలంగాణ పల్లెల్లోని ప్రతీ ఒక్క ఆడపడుచు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే ఈ బతుకమ్మ పండుగ యువతులు, ముత్తైదువులు సాంప్రదాయం ఉట్టిపడేలా తయారయ్యి ఊరంతా ఒకటయ్యి తమలో బీదా గొప్పా వర్ణం వర్గం అంతా ఒకటే అంటూ జరుపుకునే పల్లె ప్రజల సాంస్కృతిక పండుగ ఇది. రాష్ట్రంలో ప్రతి ఆడపడుచు బతుకమ్మను స్వయంగా వివిధ రకాల పూలతో.. భక్తిశ్రద్ధలతో.. పేరుస్తారు.

తొమ్మిది రోజుల పాటు జరిగే బతుకమ్మ.. వేడుకల్లో ఒక్కో రోజుది ఒక్కో ప్రత్యేకత. రోజుకో రకమైన పూలతో.. రోజుకో ప్రత్యేకమైన నైవేద్యాన్ని గౌరమ్మకు సమర్పిస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ : మహాలయ అమవాస్యరోజు బతుకమ్మ వేడుక మొదలవుతుంది. తెలంగాణలో దీన్ని పెత్రామాస అని కూడా అంటారు. నువ్వులు, బియ్యం పిండి, నూకలు కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

అటుకుల బతుకమ్మ : ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నాడు చేస్తారు. సప్పిడి పప్పు, బెల్లం, అటుకులతో నైవేద్యం తయారు చేసి అమ్మవారికి సమర్పిస్తారు.

ముద్దపప్పు బతుకమ్మ : ముద్దపప్పు, పాలు, బెల్లంతో నైవేద్యం తయారు చేసి సమర్పిస్తారు.

నానే బియ్యం బతుకమ్మ : నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యం చేస్తారు.

అట్ల బతుకమ్మ : అట్లు లేదా దోశ నైవేద్యంగా సమర్పిస్తారు.

అలిగిన బతుకమ్మ : ఈరోజు ఆశ్వయుజ పంచమి. నైవేద్యమేమి సమర్పించరు.

వేపకాయల బతుకమ్మ : బియ్యంపిండిని బాగా వేయించి వేపపండ్లుగా తయారు చేసి నైవేద్యంగా సమర్పిస్తారు.

వెన్నముద్దల బతుకమ్మ : నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం కలిపి నైవేద్యం తయారు చేస్తారు.

సద్దుల బతుకమ్మ : ఆశ్వయుజ అష్టమి నాడు ఆదేరోజు దుర్గాష్టమిని జరుపుకుంటారు. ఐదురకాల నైవేద్యాలు తయారు చేస్తారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ అన్నం, కొబ్బరన్నం, నువ్వులన్నం. తొమ్మిదిరోజులు సమర్పించే నైవేద్యాలలో మొక్కజొన్నలు, జొన్నలు, సజ్జలు, మినుములు, శనగలు, పెసర్లు, పల్లీలు, నువ్వులు, గోధుమలు, బియ్యం, కాజు, బెల్లం, పాలు ఉపయోగిస్తారు.

గత ఏడాది కరోనాతో బతుకమ్మ వేడుకలపై కొంత ప్రభావం పడింది. ఈ ఏడాది కొవిడ్‌ నుంచి కోలుకోవడంతో ప్రభుత్వం పెద్దఎత్తున ఉత్సవాలను నిర్వహిస్తోంది. ప్రతి ఊరిలో మైదానాల వద్ద ఏర్పాట్లు చేయడంతోపాటు చెరువులు, కుంటల వద్ద బతుకమ్మ ఘాట్‌లను నెలకొల్పి నిమజ్జనం సందర్భంగా అన్ని జాగ్రత్తలను పాటించాలని కలెక్టర్లకు నిర్దేశించింది.

Related posts