తెలంగాణలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇటీవల కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్ లో చేరిన గిరిజన ఎమ్మెల్యే హరిప్రియ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రచారానికి ఖమ్మంలోని కామేపల్లి మండలం గోవింద్రాల గ్రామానికి వచ్చారు. అయితే హరిప్రియ టీఆర్ఎస్ లో చేరడంపై గుర్రుగా ఉన్న కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఆమెను అడ్డుకున్నారు. వెనక్కి వెళ్లిపోవాలని నినాదాలు చేశారు.
దీంతో అక్కడే ఉన్న టీఆర్ఎస్ కార్యకర్తలు పోటీగా నినాదాలు ఇచ్చారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా అదికాస్తా ఘర్షణగా మారింది. దీంతో ఇరువర్గాలు పరస్పరం రాళ్లతో దాడిచేసుకున్నాయి. ఈ సందర్భంగా పలువురికి గాయాలు అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. పరిస్థితి మరింత దిగజారకుండా ఉండేందుకు వీలుగా హరిప్రియను అక్కడి నుంచి పంపించివేశారు. ప్రస్తుతం గోవింద్రాల గ్రామంలో టెన్షన్ వాతావరణం నెలకొంది.