telugu navyamedia
ఆంధ్ర వార్తలు

బాధితులకు న్యాయంతోనే దిశ చట్టం అమలుకు సార్థకత..

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టం.. చెప్పుకోడానికి గొప్పగా ఉన్నప్పటికీ అమల్లో బాధిత కుటుంబాలకు న్యాయం జరిగినపుడే ప్రయోజనకరంగా ఉంటుందని దివంగత టీడీపీ నేత ఎర్రన్నాయుడు కుమార్తె, రాజమండ్రి ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ అభిప్రాయం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల్లో మహిళాసాధికారతపై ఆమె మాట్లాడారు. బాధిత కుటుంబాలకు న్యాయం చేసినపుడే విశ్వసనీయత ఉంటుందన్నారు.

గడచిన రెండున్నర సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్‌లో మహిళలపై అత్యాచారాలు, హత్యలు పెరిగిపోయాయని విచారం వ్యక్తంచేశారు. మహిళలపై లైంగిక వేధింపులపై ఆంధ్రప్రదేశ్ దేశంలోనే రెండో స్థానంలో ఉన్న విషయాన్ని సభలో ప్రస్తావించారు. రాష్ట్రంలో మహిళలకు ఎక్కడా కూడా రక్షణ లేకుండా పోతుందని.. సీతానగరంలో నాలుగు నెలల కిందట ఒక మహిళపై సామూహిక అత్యాచారం జరిగినా నిందితులపై చర్యలు తీసుకున్న పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తంచేశారు. అసలు దిశ చట్టం కింద ఎంత మంది బాధితులకు న్యాయం జరిగిందనేది ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.

వృద్ధులపట్ల ప్రభుత్వ కనికరించాలని ఆమె సభాముఖంగా విన్నవించారు. వయసు మీరిన మహిళలకు వృద్ధాప్యంలో ఇతరులపై ఆదారపడకుండా సర్కారు ఇచ్చే పెన్షన్ల విషయంలో కొర్రీలు వేయకుండా… మానవత్వంతో ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని కోరారు.

Related posts