ed rides on laluparasads family

లాలూ ఫ్యామిలీకి ఈడీ షాక్

19

 ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ ఫ్యామిలీకి ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) భారీ షాక్ ఇచ్చింది. ఐఆర్‌సీటీసీ కుంభకోణం కేసులో అత్యంత విలువైన భూమిని ఈడీ సీజ్ చేసింది. రెండు ఐఆర్‌సీటీసీ హోటళ్లను ఒకే కంపెనీకి అప్పగించినందుకుగానూ లాలూ ఫ్యామిలీకి భారీ ఎత్తున భూబదలాయింపు జరిగింది. ఈ ఆరోపణలపై ఈడీ, సీబీఐలు ముమ్మర దర్యాప్తు చేస్తున్నాయి. లాలూ కుటుంబ సభ్యులు భాగస్వాములుగా ఉన్న 11 ఫ్లాట్లను ఈడీ జప్తు చేసింది. ప్రస్తుతం ఈ స్థలంలో షాపింగ్‌ మాల్‌ నిర్మాణం జరగుతున్నట్టు తెలుస్తోంది.

మార్కెట్‌ విలువ ప్రకారం వీటి విలువ 44.75 కోట్ల రూపాయలు ఉంటుందని ఈడీ వెల్లడించింది. ఐఆర్‌సీటీసీ హోటల్‌ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడినందుకు ఈడీ ఈ స్థలాన్ని సీజ్‌ చేసినట్టు తెలిపింది. ఈడీ జప్తు చేసిన ప్రాపర్టీ తొలుత డీలైట్‌ మార్కెటింగ్‌ ప్రైవేటు సంస్థ పేరు మీద ఉండగా.. ప్రస్తుతం లారా ప్రాజెక్ట్స్ పేరు మీద ఉన్నాయి. అందులో లాలూ సతీమణి, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి రబ్రీదేవితో పాటు లాలూ తనయులు తేజస్వీ యాదవ్‌, తేజ్‌ ప్రతాప్‌ యాదవ్‌లు భాగస్వాములుగా ఉన్నారు. కాగా ఇప్పటికే దాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా కోర్టు ఆరువారాల ప్రొవిజనల్‌ బెయిల్‌ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.