telugu navyamedia
ట్రెండింగ్ వ్యాపార వార్తలు సాంకేతిక

ఈ-బే చేతిలోకి .. పేటీఎం వాటాలు..

e-bay purchased part of paytm mall

పేటీఎం మాల్‌లో వాటాను అమెరికాకు చెందిన ఈ-టెయిలర్‌ సంస్థ ఈబే (5.5 శాతం) కొనుగోలు చేసింది. ఆ సంస్థ భారత ఈ కామర్స్‌ విపణిలో పెట్టుబడులు పెట్టడం ఇది మూడో సారి. ఉపఖండంలో అతిపెద్ద మార్కెట్‌ ప్లేస్‌గా అవతరించడంలో భాగంగా పేటీఎమ్‌ మాల్‌తో వాణిజ్య ఒప్పందం కుదర్చుకున్నామని ఈబే అధ్యక్షుడు, సీఈవో డెవిన్‌ వెనిగ్‌ తెలిపారు. ‘పేటీఎం మాల్‌లో ఈబే ఒక స్టోర్‌ తెరుస్తుంది. మా అంతర్జాతీయ ఇన్వెంటరీ యాక్సెస్‌ చేసేందుకు కోట్లాదిమంది పేటీఎం, పేటీఎం మాల్‌ వినియోగదారులకు దీంతో అవకాశం లభిస్తుంది. పేటీఎం మాల్‌లో దాదాపు 5.5 శాతం వాటాకు సమానంగా ఈబే పెట్టుబడి పెట్టనుంది’ అని డెవిన్‌ వెల్లడించారు.

ఈబే తొలుత 2014లో స్నాప్‌డీల్‌లో పెట్టుబడి పెట్టింది. ఆ తర్వాత వాటిని ఉపసంహరించుకొనేందుకు 2017లో 61 మిలియన్‌ డాలర్లు ఖర్చుచేసింది. అదే ఏడాది ఫ్లిప్‌కార్ట్‌లో ఈక్విటీ వాటా బదలాయింపునకు 500 మిలియన్‌ డాలర్ల నగదు ఇచ్చింది. భారత్‌లోని తన వ్యాపారాన్ని ఫ్లిప్‌కార్ట్‌కు విక్రయించింది. అయితే 2018లో వాల్‌మార్ట్‌ 16 బిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టడంతో తన వాటాను 1.1 బిలియన్‌ డాలర్లకు అమ్మేసింది. 2018 మార్చితో ముగిసిన ఆర్థిక ఏడాదిలో పేటీఎం మాల్‌ రూ.1,787 కోట్ల నికర నష్టాన్ని నమోదు చేయడం గమనార్హం.

Related posts