వెస్ట్ బెంగాల్ లో జూనియర్ డాక్టర్లపై దాడికి నిరసనగా ఇవాళ దేశవ్యాప్త సమ్మెకు ఇండియన్ మెడికల్ అసోసియేషన్(IMA) పిలుపునిచ్చింది. నేటి ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు అన్నిరకాల వైద్యసేవలు(అత్యవసర సేవలు మినహా) నిలిచిపోతాయని ఐఎమ్ఏ తెలిపింది. హాస్పిటల్స్ లో డాక్టర్లు, సిబ్బందిపై దాడిచేసే వ్యక్తులను శిక్షించేందుకు కేంద్రం సమగ్రమైన చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేసింది. గుజరాత్ లోని వడోదరాలోని సర్ సయ్యాజీరావ్ జనరల్ హాస్పిటల్ లో ఓపీ డిపార్ట్ మెంట్ బయట డాక్టర్లు ఇవాళ ఉదయం ఆందోళనకు దిగారు.బెంగాల్ డాక్టర్లపై దాడిని వీరు తీవ్రంగా ఖండించారు. గత సోమవారం కోత్ కతాలోని ఎన్‌ఆర్‌ఎస్ మెడికల్ కాలేజీలో ఓ రోగి చనిపోవడంతో అతని బంధువులు ఇద్దరు డాక్టర్లపై దాడి చేసి గాయపర్చిన విషయం తెలిసిందే.
డాక్టర్ల డిమాండ్లకు అంగీకరిస్తున్నట్లు వెస్ట్ బెంగాల్ సీఎం మమత ప్రకటించారు. భద్రతపై డాక్టర్లకు పూర్తి భరోసా ఇస్తామని ఆమె తెలిపారు. డాక్టర్లపై దాడి చేసినవారిని అరెస్ట్ చేస్తామన్నారు. డాక్టర్లు వెంటనే తిరిగి విధుల్లో చేరాలన్నారు. జూన్-10,2019న జరిగిన ఘటన దురదృష్టకరమన్నారు. ఆ ఘటనలో గాయపడి ప్రైవేట్ హాస్పిటల్ లో ట్రీట్మెంట్ పొందుతున్న జూనియర్ డాక్టర్ మెడికల్ ట్రీట్మెంట్ ఖర్చులన్నీ రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని ఆమె తెలిపారు. తాము ఒక్క డాక్టర్ ని కూడా అరెస్ట్ చేయలేదని, ఏ విధమైన పోలీస్ చర్య తీసుకోబోమని ఆమె తెలిపారు. రాష్ట్రంలో ESMA(ఎసెన్షియల్ సర్వీసెస్ మెయింటెనెన్స్) చట్టాన్ని విధించాలనుకోవడం లేదన్నారు.