telugu navyamedia
ఆరోగ్యం

కృష్ణపట్నంలో ఒమిక్రాన్ మందు పంపిణీ..

కరోనా కల్లోలం సృష్టించిన రోజుల్లో ఆయన మందు… ఓ దివ్యౌషధం… మెజారిటీ జనం ఎగబడటం… కోర్టు తీర్పుకోసం ఎదురుచూపులు… మందు తయారు చేయించుకోడానికి ప్రజాప్రతినిధులు క్యూకట్టడం… ప్రపంచవ్యాప్తంగా ఆనందయ్య పేరు మారు మోగిపోయింది.

మందు తయారీలో వాడే దినుసులన్నీ వ్యాధినిరోధక శక్తిని పెంపొందించేవని వైద్యనిపుణుల బృందం అధ్యయనం చేసింది. మందు తిన్నవారికి ఎలా దుష్ప్రభావం లేదని… మందు పంపిణీకు కోర్టు అనుమతిచ్చింది. ఇదంతా రూపాయికి ఒకవైపు… రోజులు గడిచాయి… ఔషధతయారీదారుడు ఆనందయ్య ప్రభుత్వ ప్రతినిధులకు మింగుడు పడని పరిస్థితి నెలకొంది. ఇపుడు కథ అడ్డం తిరిగింది.

కరోనా వైరస్ రూపాంతరం చెంది కొత్త వేరియంట్ ఒమిక్రాన్ విస్తరిస్తోంది. ఒమిక్రాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి అద్భుతమైన మందు రూపొందించానని ఆనందయ్య ప్రకటించడంతో చాలామంది ముందస్తు జాగ్రత్తగా మందు వాడేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. దీంతో నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.. ఆనందయ్య మందు కోసం  ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున  ప్రజలు తరలి రావడంతో గ్రామస్తులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.  ఇటీవలే ఒమిక్రాన్‌కు  మందు తయారు చేశానని ఆనందయ్య ప్రకటించిన విషయం తెలుసుకుని ప్రజలు భారీగా తరలివచ్చారు.  దీంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఆనందయ్య మందు కోసం ప్రజలు భారీగా తరలివస్తుండటంతో తమకు ఇబ్బందిగా ఉందని గ్రామస్తులు  పోలీసులకు తెలిపారు.  దీంతో పోలీసులు ఆనందయ్యతో  చర్చలు జరిపారు.   ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకున్న పత్రాలను చూపించాలని కోరారు. తనవద్ద ఎలాంటి అనుమతి పత్రాల్లేవని, గతంలో కోర్టు తీర్పుతోనే మందుపంపిణీ చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ఇప్పుడు ఇచ్చే ఒమిక్రాన్ మందు  కూడా   కోవిడ్ లో   భాగమేనని ఆనందయ్య అంటుండగా పోలీసులు, గ్రామస్తులు అందుకు ఒప్పుకోవటంలేదు.

ఆనందయ్య వద్ద కోవిడ్ మందు తీసుకు వెళ్లటానికి ఇతర రాష్ట్రాల  నుంచి ప్రజలు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు.  మరికొంతమంది మంది రోగులు అంబులెన్స్ లో కూడా వచ్చి మందును తీసుకు వెళ్లారు. అప్పట్లో కోవిడ్ బారిన పడినవారు తమ  ఊళ్లోకి రావటంతో   గ్రామస్తులకు కోవిడ్   సోకి కొందరు మరణించారని  గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.   

ఒమిక్రాన్ మందుకు సంబంధించి అనుమతులు తీసుకోవాల్సిందేనని… గ్రామంలో పెద్ద ఎత్తున ప్రజలు  గూమి గూడటానికి  వారు ఒప్పుకోవటం లేదు.   తాను స్వఛ్చందంగా ఉచితంగా   ఒమిక్రాన్  మందు పంపిణీ   చేస్తుంటే గ్రామస్తులు ఎందుకు అడ్డుకుంటున్నారో   తెలియటం  లేదని ఆనందయ్య అన్నారు.  ఇప్పుడు ఒమిక్రాన్ మందు పంపిణీ చేయవద్దని   అనే  వారంతా గతంలో తన వద్ద కోవిడ్ మందు వాడి…. ఇతరులకు కూడా పంపిణీ చేశారని ఆనందయ్య వెల్లడించారు.

 తానేమీ మందు పంపిణీ చేస్తూ   డబ్బులు వసూలు  చేసుకోలేదని… తన బ్యాంకు  ఖాతాలు కూడా చెక్  చేసుకోవచ్చని ఆనందయ్య చెప్పారు. ఇంతకీ ప్రభుత్వ అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో అంతుబట్టకుంది. వ్యాపారంతో సంబంధంలేకుండా మందు ఉచితంగా ఇస్తున్నా… ఆనందయ్యను, మందు తీసుకునేవారిని ఇబ్బంది పెట్టడం సరికాదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

Related posts