telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఆ జిల్లాలో .. వారేనట.. !!

distict wise report on ap

ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన కృష్ణా జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నట్టేనా .. గతంలో మాదిరి తెలుగుదేశం పట్టు నిలుపుకుంటుందా..? లేదా వైసీపీకి అనుకూలంగా మార్పు చోటు చేసుకుందా..? జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రభావం ఎంతుంటుంది..? ఇదే ఇప్పుడు కృష్ణా జిల్లాలో ఏ మూల చూసినా జరుగుతున్న వాడి వేడి చర్చ.. అంతటితో ఆగటంలేదు.. బ్రహ్మాండమైన పందేలు కూడా వేస్తూనే ఉన్నారు బెట్టింగ్ రాయిళ్ళు. రాష్ట్రంలో కృష్ణా జిల్లాలో పార్టీల అంచానాలు భారీగా పెరిగాయి. ఇక్కడ తమకు అధిక స్థానాలు వస్తాయని ప్రతి పార్టీ చెప్పుకుంటోంది. అయితే పోలింగ్ సరళని పరిశీలిస్తే ప్రతి నియోజక వర్గంలోనూ గట్టి పోటీ కన్పిస్తుంది. గత ఎన్నికల కంటే ఇక్కడ వైసీపీ పుంజుకునే అవకాశాలు కన్పిస్తున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో ఐదు స్థానాలు వైసీపీకి దక్కిన విషయం తెలిసిందే. పదకొండు స్థానాల్లో టీడీపీ గెలిచింది. ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించింది.

తాజాగా జరిగిన ఎన్నికల్లో జిల్లాల్లో సమీకరణాలు మారినట్టు ఓటర్ల నాడిని బట్టి తెలుస్తోంది. కృష్ణా జిల్లాలో మొత్తం 16 అసెంబ్లీ స్థానాలు, రెండు పార్లమెంటు స్థానాలున్నాయి. ఎవరికీ భారీ మెజారిటీలు రావన్నది దాదాపుగా తేలిపోయింది. మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో 205 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జగ్గయ్యపేట, నందిగామ, పెనమలూరు, పామర్రు, గుడివాడ, మైలవరం, తిరువూరు, కైకలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో వైసీపీ, తెలుగుదేశం పార్టీల మధ్యనే ప్రధాన పోరు ఉంది. ఈ నియోజకవర్గాల్లో కొన్ని వైసీపీకి అనుకూలంగా కన్పిస్తుండగా మరికొన్ని స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండే అవకాశముంది. నందిగామ, జగ్గయ్యపేట, పామర్రు, గుడివాడ, తిరువూరు, కైకలూరు నియోజకవర్గాల్లో వైసీపీకి కొంత అనుకూల వాతావరణం కన్పిస్తుంది. పెనమలూరు, మైలవరం, కైకలూరు, గన్నవరం నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందంజలో ఉండే అవకాశముంది. విజయవాడ సెంట్రల్, విజయవాడ తూర్పు, విజయవాడ పశ్చిమ, అవనిగడ్డ, మచిలీపట్నం, పెడన, నూజివీడు నియోజకవర్గాల్లో త్రిముఖ పోటీ నెలకొనే అవకాశాలు కనిపిస్తున్నాయి.

జిల్లాలో జనసేన అభ్యర్థులు బలంగా ఉండటంతో పాటు తాము గెలవలేక పోయినా పక్క పార్టీ అభ్యర్థులను ఓడించేంత బలం ఉందని మాత్రం ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. ఈ నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా మారడంతో గెలుపోటములు అంచనావేయడం కష్టంగానే ఉంది. టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ఈ నియోజకవర్గాల్లో ఆందోళనగా ఉండటం కన్పించింది. మొత్తం మీద కృష్ణా జిల్లాలో గత ఎన్నికల కంటే ఈ సారి నువ్వా నేనా అనే వాతావరణం నెలకొందనే చెప్పాలి. గత ఎన్నికలలో రెండు పార్టీల మధ్య చీలిన ఓట్లు ఇప్పుడు మూడు పార్టీలు పంచుకోవడం కూడా చాలా గట్టి పోటీని ఇస్తుండటం సహజంగా కనిపిస్తుంది.

Related posts