ఇటీవల విక్రం కుమారుడు ధ్రువ్ నటించిన రీమేక్ చిత్రం ‘ఆదిత్య వర్మ’. ధ్రువ్ నటనకు మంచి మార్కులు పడ్డాయి. విశ్లేషకుల మన్ననలు అందుకున్నారు. అయితే ఈ సినిమాకు ముందు బాలా దర్శకత్వంలో ‘వర్మ’ పేరిట తొలి రీమేక్ సిద్ధమైన విషయం తెలిసిందే. కొన్ని కారణాలతో దానిని పక్కనపెట్టి.. మళ్లీ కొత్తగా తెరకెక్కించి ‘ఆదిత్య వర్మ’గా విడుదల చేశారు. ఈ నేపథ్యంలో బాలా ‘వర్మ’ చిత్రాన్ని ఆన్‌లైన్ వేదికపై విడుదల చేయడానికి చిత్రవర్గాలు సన్నాహాలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది.
వాస్తవానికి ఈ సినిమా కోసం రూ.20 నుంచి రూ.28 కోట్ల వరకు ఖర్చు అయినట్లు కోలీవుడ్‌లో వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ వెర్షన్ ద్వారా డిజిటల్ రైట్స్‌తో కొంత మొత్తాన్ని రాబట్టుకోవడానికి నిర్మాణ వర్గాలు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈ రైట్స్ కోసం ఓ సంస్థ రూ.5 కోట్ల వరకు అడిగినట్లు తెలుస్తోంది. అయితే విక్రం తరఫున అందుకు సమ్మతించలేదనే వార్తలు వినిపిస్తున్నాయి. మరి నిర్మాత, విక్రం కలిసి ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి.