telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

సోనూసూద్ మాటిచ్చిన అనాథ పిల్లలను దత్తత తీసుకున్న దిల్ రాజు

Sonusood

కరోనా లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి సోనూసూద్ నిరాశ్రయులకు, పేదలకు అండగా నిలుస్తూ అందరి మన్ననలు అందుకుంటున్నారు. ఇటీవల యాదాద్రి భున‌వ‌గిరి జిల్లా ఆత్మ‌కూరు మండ‌ల‌కేంద్రంలో ఉండే స‌త్య‌నారాయ‌ణ, అనురాధ‌ దంపతులకు ముగ్గురు పిల్లలు. స‌త్య‌నారాయ‌ణ‌ ఏడాది క్రితం అనారోగ్యంతో మృతి చెందాడు. అప్ప‌టి నుంచి త‌ల్లి అనురాధ కూలిపనులు చేసుకుంటూ ముగ్గురు పిల్ల‌ల‌ను పోషిస్తోంది. వారం క్రితం త‌ల్లి అనురాధ కూడా అనారోగ్యంతో మృతి చెందింది. దీంతో ఆ ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. పెద్ద కుమారుడు మ‌నోహ‌ర్ త‌న చెల్లి, త‌మ్ముడి ఆల‌నా పాల‌నా చూసుకుంటున్నాడు. ఈ చిన్నారుల దీన‌స్థితిని రాజేశం క‌ర‌ణం అనే వ్య‌క్తి ట్విట్ట‌ర్ ద్వారా సోనూసూద్ దృష్టికి తీసుకొచ్చాడు. దీనిపై స్పందించిన సోనూసూద్‌..ముగ్గురు పిల్లలు అనాథ‌లు కాద‌ని, ఇక‌పై తాను వారికి అండ‌గా ఉంటాన‌ని, ముగ్గురి పిల్ల‌ల బాధ్య‌త తీసుకుంటాన‌ని హామీనిచ్చి గొప్ప మ‌న‌సు చాటుకున్నారు. దీంతో ఆ పిల్లలకి మేమున్నామంటూ అండగా నిలుస్తున్నారు సినీ, రాజకీయ ప్రముఖులు. ఇప్పటికే కేటీఆర్ లోకల్ నాయకులను ఇంటికి పంపి తక్షణ సాయం అందించగా, ఎంపీ కోమటిరెడ్డి కూడా తక్షణ సాయం అందించి ఏ కష్టం వచ్చినా నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. ఇక పోలీసులు చిన్నారులకు అండగా నిలిచారు. ఎస్‌ఐ రూ. 5వేలు, పోలీసు సిబ్బంది రూ. 6వేలు అందజేశారు. ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి ఈరోజు చిన్నారులను కలవనున్నారు. ఇక అనాధలుగా మారిన ముగ్గురు పిల్లల వార్త చూసి పంచాయితీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లిదయాకర్‌రావు చలించిపోయారు. వెంటనే ఆపిల్లలను దత్తత తీసుకోవాలని ప్రముఖ సినిమా నిర్మాత దిల్‌రాజుకు ఫోన్‌ చేసి కోరారు. వెంటనే ఆ పిల్లలను దత్తత తీసుకుంటానని దిల్‌రాజు మాటిచ్చారు.

Related posts