telugu navyamedia
రాజకీయ సినిమా వార్తలు

సిరులు నడయాడిన రహదారులివి.. చార్మినార్ నుంచి బందరు రేవుకు వజ్రాల తరలింపు

హైదరాబాద్ ఒకప్పటి భాగ్యనగరం. వజ్రాలు, రత్నాలు, సుగంధద్రవ్యాల వ్యాపారాలకు పేరుగాంచిన నగరం. గోల్కొండ కేంద్రంగా కుతుబ్ షాహీల కాలంలో ఈ నగరం సిరిసంపదలతో తుల తూగింది. వజ్రాల వ్యాపారంలో ప్రపంచంలోనే రెండో ఈజిప్టుగా పేరు పొందింది. కుతుబ్ షాహీల్లో నాలుగో వాడైనా మహమ్మద్ కులీ ఎంతో గొప్పవాడు. ఆయన పాలనలో అంతా స్వర్ణ యుగమే నడిచింది. మహమ్మద్ కులీ తన 14 వ ఏటనే సింహాసనాన్ని అధిష్టించాడు.

1605లో ఆంధ్ర ప్రాంతానికి వచ్చిన డచ్చి వారికి, 1611లో వచ్చిన ఇంగ్లీష్ ఈస్టిండియా కంపెనీ వారికి బందరు లేదా మచిలీపట్నంగా పిలువబడే ఓడరేవు కేంద్రంగా వ్యాపారం నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చాడు. 14వ శతాబ్ధంలో బహమనీ సుల్తానులు అరబ్ వర్తకుల కోసం మచిలీపట్నం ఓడరేవు నిర్మించగా, ఆ తరువాత మహ్మద్ కులీ కాలంలోనే ఆ రేవు మరింత అభివృద్ధి చెందింది.

హైదరాబాద్ లోని చార్మినార్ నుంచి పడమటికి వెళ్లే రహదారి గోల్కొండ కోట వద్ద ప్రారంభమై చార్మినార్ నుంచి తూర్పు దిశగా మచిలీపట్నం ఓడరేవుకు చేరుతుంది. ఈ రహదారిని మహమ్మద్ కులీ నిర్మించాడు. కొన్ని శతాబ్దాల పాటు ఈ రోడ్డే హైదరాబాద్ నగరాన్ని ప్రపంచ దేశాలకు అనుసంధానించింది. ఎడ్ల బండ్లలో, గుర్రపు బండ్లలో రత్నాలు, సుగంధద్రవ్యాలు ఆ రోజుల్లో ఈ రోడ్డు మీదుగానే రవాణా అయ్యేవి. ఆ బండ్లకు రక్షణగా ఓడరేవు నుంచి నగరానికి, నగరం నుంచి ఓడరేవుకి సుల్తాన్ సైనికులు కవాతు చేసుకుంటూ వెళ్లేవారు.

చరిత్రకారులకు లభ్యమైన దస్ర్తాల ప్రకారం ఆ రోజుల్లో మచిలీపట్నం ఓడరేవుకు ప్రతి రోజూ కనీసం 21 ఓడలు లంగరు వేసేవి. దీనిని బట్టి ఆ ఓడరేవు వ్యాపార కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా కొనసాగిందని అర్థమవుతుంది.1864 నవంబర్ 1వ తేదీ రాత్రి తుపాను దెబ్బకు ఓడరేవు నాశనమైంది. తుపాను దాదాపు 30 వేల మంది ప్రాణాలను బలిగొంది. ఇలాంటి ఎన్ని విపత్తులు ఎదురైనా మచిలీపట్నం ఓడరేవు నేటికీ చెక్కు చెదరక అనేక వ్యాపారాలకు కేంద్రంగా కొనసాగుతోంది.

Related posts