telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

టైర్ పంచర్ అయినా.. 100కే డయల్.. స్పందించి సాయం చేసిన అధికారులు…

dialed 100 on tyre fail

దిశ కేసు ఉదంతం పోలీసు వ్యవస్థలో విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఈ ఘటన తరువాత పోలీసుల చర్యలు అందరి ప్రశంసలను అందుకునేలా చేస్తున్నాయి. నలుగురు నిందితులను ఎన్ కౌంటర్ చేసిన అనంతరం తెలంగాణ ప్రజలు హీరోలుగా గుర్తించడం.. వారిలోని బాధ్యతను మరింత పెంచినట్టయింది. సహాయం కోసం డయల్ 100కు వచ్చే ఎలాంటి ఫోన్ కాల్ ను అయినా పెడచెవిన పెట్టే ధోరణికి పుల్ స్టాప్ పడినట్టేనని నిరూపించే ఉదంతం ఇది. ఆపదలో ఉన్నట్లు తెలియగానే పోలీసులు క్షణాల్లో స్పందించారు. వారికి అవసరమైన సహాయ, సహకారాలను అందజేశారు. హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు వద్ద అర్ధరాత్రి దాటిన తరువాత చోటు చేసుకున్న ఘటన ఇది.

హాలియాకు చెందిన శ్రీనివాస్‌, భవాని దంపతులు తమ కారులో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి బయలుదేరారు. తెల్లవారు జామున 4 గంటలకు వారు విమానాన్ని ఎక్కాల్సి ఉంది. మార్గమధ్యలో ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రయాణిస్తున్న సమయంలో వారి కారు పంక్చర్ అయింది. ఔటర్ రింగ్ రోడ్డు ఎగ్జిట్ నంబర్ 13 సమీపంలో వారి కారు ఆగిపోయింది. అప్పటికి సమయం 2 గంటలు. ప్రత్యామ్నాయ మార్గాలేవీ కనిపించకపోవడంతో వెంటనే వారు డయల్ 100కు ఫోన్ చేశారు. తమ పరిస్థితిని, తాము ఉన్న ప్రదేశాన్ని వివరించారు. ఫోన్ చేసిన కొన్ని నిమిషాల వ్యవధిలో పోలీసులు స్పందించారు. 15 నిమిషాల్లో ఆదిభట్ల పోలీసులు మెకానిక్ తో సహా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మెకానిక్ తో టైరును సరి చేయించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్న 20 నిమిషాల్లోనే ఇదంతా పూర్తయింది. సకాలంలో పోలీసులు సహకరించడం పట్ల శ్రీనివాస్ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.

Related posts