telugu navyamedia
ఆంధ్ర వార్తలు

ప్రముఖ కార్టూనిస్టు ‘బుజ్జాయి’ ఇక‌లేరు..

ప్రముఖ కార్టూనిస్టు దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి గురువారం రాత్రి చెన్నైలో తుదిశ్వాస విడిచారు. చిట్టిపొట్టి బొమ్మలు, బాలల కథల సంపుటితో బుజ్జాయిగా బహుళ ప్రాచుర్యం పొందారు. అద్భుతమైన కార్టూన్లు, కథలతో చిన్నారులతో పాటు పెద్దలను సైతం అలరించిన సుబ్బరాయశాస్త్రి కలం పేరు బుజ్జాయి. కార్టూనిస్టుగా, చిన్న పిల్లల కథా రచయితగా ఆయన చాలా ఫేమస్.

ముఖ్యంగా ఆయన క్రియేట్ చేసిన డుంబు పాత్ర సుబ్బరాయశాస్త్రికి చాలా పేరు తెచ్చింది.అలాగే ‘పంచతంత్ర’ ధారావాహిక కథలు ‘ది ఇలస్ట్రేటెడ్‌ వీక్లీ’లో 1963–68 వరకు ప్రచురితమయ్యాయి. గురజాడ అప్పారావు రచించిన కన్యాశుల్కం కథానికను బొమ్మలద్వారా పాఠకులకు పరిచయం చేశారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఆయన పలు రచనలకు అవార్డులు అందించాయి.

ఆంధ్రప్రదేశ్‌ పిఠాపురంలో ప్రముఖ రచయిత, కవి దేవులపల్లి కృష్ణశాస్త్రి, రాజహంస దంపతులకు 1931 సెప్టెంబర్‌ 11న ఆయన జన్మించారు. దేవులపల్లి సుబ్బరాయశాస్త్రికి ఇద్దరు కుమార్తెలు, ఓ కుమారుడు ఉన్నారు. సుబ్బరాయశాస్త్రి కుమారుడు కూడా రచయిత. ఓ కుమార్తె రేఖా సుప్రియ, బుజ్జాయి రెండవ కుమార్తె లలిత రామ్‌ కూడా రచయిత్రి అయ్యారు.

చిన్నతనంలో తండ్రి చేయి పట్టుకుని సాహితీ, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు తప్పితే ఏ రోజునా పాఠశాలకు వెళ్ళి విద్యను అభ్యసించింది లేదు. సాంప్రదాయక చదువులు చదవకపోయినా ఆయన తనకంటూ ఓ ప్రత్యేక పేరును సంపాదించుకున్నారు. ఆయన తండ్రి వెన్నంటే ఉండేవారు. అలా ఉండడం వలన ఆ కాలం నాటి గొప్ప వ్యక్తులందరికి సన్నిహితంగా మెలిగారు.

ప్రముఖ చిత్రకారుడు, కార్టూనిస్ట్ , 'డుంబు' సృష్టికర్త బుజ్జాయి ఇక లేరు!

 దేవులపల్లి సుబ్బరాయశాస్త్రి 17 ఏళ్ల వయసులో బుజ్జాయి ‘బానిస పిల్ల’ అనే బొమ్మల పుస్తకం ప్రచురించి ‘కామిక్‌ స్ట్రిప్‌’ పుస్తకాలకు దేశంలోనే ఆద్యుడిగా పేరుపొందారు. బాపు రమణల బుడుగు లాంటి క్యారెక్టర్ డుంబు సృష్టికర్తగా నిలిచారు

చిన్నారులు ఎంతగానో ఇష్టపడే పంచతంత్ర కథలకు ఎంతో అందమైన బొమ్మలు వేసి ఇలస్ట్రేటెడ్ వీక్లీలో 1963 నుంచి 68 వరకూ సీరియల్ గా ప్రచురించారు. ఈ ఇంగ్లీష్ కామిక్స్ 5 పుస్తకాలుగా వచ్చాయి. మిత్రలాభం, మిత్రభేదం పుస్తకాలుగా ఇవి తెలుగులోనూ అందుబాటులో ఉన్నాయి. ఆయన భైరవ్, పెత్తందార్, డుంబు కామిక్ స్ట్రిప్పులను చేశారు.

‘న్యాయానికి భయం లేదు’ అనే బొమ్మల ధారావాహిక 1975లో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైంది.  2010లో  ‘నాన్న-నేను’ అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రాశారు. ‘నవ్వులబండి – డుంబు బొమ్మల కథలు’ అనే పుస్తకాన్నిరాసి చిన్నారులకు వినోదాన్ని పంచారు. ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు, చిత్రకారులు సంతాపం వ్యక్తం చేశారు.

Related posts