ఏపీ ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో దేవినేని అవినావ్ ఈ సాయంత్రం వైసీపీలో అధికారికంగా చేరనున్నారు. గతంలోనే అవినాశ్ వైసీపీలోకి వస్తారని ప్రచారం సాగినా..ఆయన ఖండించారు. ఒక వైపు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీక్ష చేస్తున్న సమయంలో..వైసీపీ వ్యూహాత్మకంగా అదే పార్టీకి చెందిన యువత అధ్యక్షుడిని తమ పార్టీలోకి తీసుకోవాలని నిర్ణయించింది. దీని మీద అవినాశ్ తన తండ్రి అనుచరులు..తన సన్నిహితులతో సుదీర్ఘంగా చర్చించారు. ఆ తరువాత వైసీపీలో చేరాలని అనుచరుల ఒత్తిడితో చివరకు ముహూర్తం ఖరారు చేసారు.
టీడీపీలో ప్రాధాన్యత దక్కటం లేదనే కారణంగానే ఆయన పార్టీ వీడుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే, అవినాశ్ కు వైసీపీలో దక్కే ప్రాధాన్యత ఏంటనే దాని పైన చర్చ మొదలైంది. అవినాశ్ కు వైసీపీ విజయవాడ తూర్పు బాధ్యతలు అప్పగిస్తారని సమాచారం. అదే సమయంలో టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరించిన నెహ్రూ అనుచరులు సైతం వైసీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.