telugu navyamedia
సినిమా వార్తలు

‘దేవ్‌’ మూవీ రివ్యూ

dev movie on feb 14

స‌మ‌ర్ప‌ణ‌: బి.మ‌ధు
నిర్మాణ సంస్థ‌లు: లైట్ హౌస్ మూవీ మేక‌ర్స్‌, ప్రిన్స్ పిక్చ‌ర్స్‌, రిల‌య‌న్స్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌
తారాగ‌ణం: కార్తి, ర‌కుల్ ప్రీత్ సింగ్‌, ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, నిక్కి గ‌ల్రాని, కార్తీక్ ముత్తురామ‌న్ త‌దిత‌రులు
సంగీతం: హేరీష్ జైరాజ్‌
ఛాయాగ్ర‌హ‌ణం: ఆర్‌.వేల్‌రాజ్‌
క‌ళ‌: రాజీవ‌న్‌
కూర్పు: రూబెన్‌
నిర్మాత‌లు: ఠాగూర్ మ‌ధు, ఎస్‌.ల‌క్ష్మ‌ణ్ కుమార్‌
ద‌ర్శ‌క‌త్వం: ర‌జ‌త్ ర‌విశంక‌ర్‌

`ఆవారా`, `నా పేరు శివ‌`, `యుగానికొక్క‌డు`, `ఖాకి` వంటి చిత్రాల‌తో తెలుగు ప్రేక్ష‌కుల‌కు ద‌గ్గ‌రైన హీరో కార్తి. ఈయ‌న న‌టించిన చిత్రాల‌న్నీ తెలుగులో కూడా స‌మాంత‌రంగా విడుద‌ల‌వుతుంటాయి. ఈ క్ర‌మంలో కార్తి న‌టించిన రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ `దేవ్‌` ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. వైవిధ్య‌మైన క‌థ‌ల‌ను ఎంచుకుంటూ ప్రేక్ష‌కుల‌ను త‌న‌దైన న‌టన‌తో ఆక‌ట్టుకుంటున్న ఈ హీరో దేవ్‌గా ఎలా మెప్పించాడో తెలుసుకోవాలంటే సినిమా క‌థ‌లోకి వెళ‌దాం…

క‌థ‌:
దేవ్‌(కార్తి) త‌న మ‌న‌సుకు న‌చ్చినట్లు ఉంటూ త‌న‌కు న‌చ్చిన ప్ర‌దేశాల‌కు వెళుతుంటాడు. ఫ్రీలాన్స్ ఫోటో జ‌ర్న‌లిజం చేస్తుంటాడు. అత‌నికి విఘ్నేష్‌(ఆర్‌.జె.విఘ్నేష్‌కాంత్‌), నిషా(అమృత‌) ప్రాణ స్నేహితులు. ముగ్గురు క‌లిసి తిరుగుతుంటారు. విఘ్నేష్ కార‌ణంగా దేవ్ పేస్‌బుక్‌లో ఒక‌రికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపుతాడు. అది మేఘ‌న(ర‌కుల్ ప్రీత్ సింగ్‌) అని త‌ర్వాత తెలుస్తుంది. తండ్రి త‌న త‌ల్లిని విడిచి పెట్టి వెళ్లిపోవ‌డంతో చిన్న‌ప్పుడు ఎన్నో క‌ష్టాలు ప‌డ్డ మేఘ‌న పాతికేళ్ల వ‌య‌సులో త‌న క‌ష్టంతో బిజినెస్ ఉమెన్ స్థాయికి ఎదుగుతుంది. ఆమెను ప్రేమించ‌డానికి దేవ్ చాలా క‌ష్ట‌ప‌డ‌తాడు. ముందు దేవ్ అంటే పెద్దగా ఆస‌క్తి చూప‌ని మేఘ‌న త‌ర్వాత అత‌న్ని ప్రేమిస్తుంది. ఓ కార‌ణంగా మేఘ‌న‌తో దేవ్ మాట్లాడ‌లేక‌పోతాడు. దాంతో మేఘ‌న త‌న‌ను దేవ్ నిర్ల‌క్ష్యం చేస్తున్నాడ‌నుకుని అత‌నితో గొడ‌వ‌ప‌డి వెళ్లిపోతుంది. దేవ్ ఎంత న‌చ్చ‌చెప్పినా మేఘ‌న వినిపించుకోదు.దేవ్‌కు పెద్ద యాక్సిడెంట్ అవుతుంది. దాని వ‌ల్ల దేవ్ ఎలాంటి పరిస్థితిని ఫేస్ చేశాడు? దేవ్, మేఘ‌న ఒక్క‌ట‌య్యారా? అనే విష‌యాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే…

విశ్లేష‌ణ‌:
వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌ను ఎంచుకుంటూ ఆ పాత్ర‌లకు త‌గ్గ‌ట్టు న్యాయం చేస్తున్న హీరో కార్తి.. ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ చెప్పిన కాన్సెప్ట్‌ను న‌మ్మి దేవ్ సినిమా చేశాడు. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు బ‌రువు త‌గ్గాడు. లుక్ ప‌రంగా కొత్త‌గా క‌న‌ప‌డే ప్ర‌య‌త్నం చేశాడు. రోడ్ జ‌ర్నీని ఎంజాయ్ చేసే యువ‌కుడిగా.. ప్రేయ‌సి కోసం తాప‌త్ర‌య ప‌డే వ్య‌క్తిగా త‌న పాత్ర‌కు న్యాయం చేశాడు. ఇక ర‌కుల్ ప్రీత్ సింగ్ ఇప్ప‌టి వ‌ర‌కు చేయ‌ని పాత్ర‌ను ఈ చిత్రంలో చేసింద‌నే చెప్పాలి. కాస్త సీరియ‌స్‌గా సాగే పాత్ర‌లో న్యాయం చేసింది. ఇక హీరో స్నేహితుడిగా న‌టించిన విఘ్నేష్‌, అమృత పాత్ర‌లు నామ మాత్ర‌మే అయ్యాయి. ఇక హీరో తండ్రిగా న‌టించిన ప్రకాష్‌రాజ్‌, హీరోయిన్ త‌ల్లిగా న‌టించిన ర‌మ్య‌కృష్ణ పాత్ర‌కు పెద్ద‌గా ప్రాధాన్యం లేదు. అంత న‌ట‌న చేయ‌గ‌లిగే న‌టుల‌ను అలాంటి ప్రాధాన్యం లేని పాత్ర‌ల‌కు ఎందుకు తీసుకున్నార‌నేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌గా అనిపిస్తుంది. ద‌ర్శ‌కుడు ర‌జ‌త్ ర‌విశంక‌ర్ ఏం చెప్పి కార్తిని ఒప్పించాడో తెలియ‌దు కానీ.. ఆ ఎమోష‌న్‌ను తెర‌పై ఆవిష్క‌రించ‌డంలో పూర్తిగా విఫ‌ల‌మ‌య్యాడు. ఇక హేరీష్ జైరాజ్ సంగీతం త‌న పాత ట్యూన్స్‌నే వింటున్న‌ట్టుగా అనిపించింది. ఎమోష‌న‌ల్ సీన్స్‌కు హార‌ర్ మూవీ స్టైల్ ఆఫ్ నేప‌థ్య సంగీతం అందించాడు. వెట్రి కెమెరా వ‌ర్క్ బావుంది. సినిమాలో ల‌వ్ సీన్స్‌లో ఇన్‌టెన్సిటీ క‌న‌ప‌డ‌దు. సినిమా అంతా సాగ‌దీత‌గా క‌న‌ప‌డింది. పెద్ద‌గా ఆక‌ట్టుకోని రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ దేవ్‌

రేటింగ్‌: 2/5

Related posts