telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

ఉన్నావ్ ఘటన .. అట్టుడికిపోతున్న ఉత్తరప్రదేశ్..

యూపీ రాజకీయాలను ఉన్నావ్‌ ఘటన హీటెక్కించింది. యోగి సర్కార్‌ను లక్ష్యంగా చేసుకుని విపక్షాలు రోడ్డెక్కాయి. బాధితురాలి ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులను ప్రియాంకా గాంధీ పరామర్శిస్తే.. అసెంబ్లీ ఎదుట రోడ్డుపై బైఠాయించారు మాజీ సీఎం అఖిలేష్‌. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే అత్యాచార కేసుల్లో త్వరగా తీర్పులు వెల్లడించడం సరికాదని అభిప్రాయాపడ్డారు. కాంగ్రెస్‌, ఎస్పీ, బీఎస్పీ తదితర పార్టీలు బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. బాధితురాలి మృతిపై ఆవేదన వ్యక్తం చేసిన కాంగ్రెస్‌ పార్టీ నేత ప్రియాంకా గాంధీ.. ఉన్నావ్‌లో పర్యటించారు. బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించారు. నిందితులను కఠినంగా శిక్షించాలంటూ.. బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు ప్రియాంక. అత్యాచారాలకు భారతదేశం రాజధానిగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్‌ ఎంపీ రాహుల్‌ గాంధీ. యూపీకి చెందిన బీజేపీ ఎమ్మెల్యే ఓ రేప్‌ కేసులో నిందితుడుగా ఉన్న.. దానిపై ప్రధాని మోడీ ఇంతవరకు స్పందించలేదన్నారు.

ఉన్నావ్‌ ఘటనలో నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ యూపీ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌.. అసెంబ్లీ ఎదుట ధర్నా చేశారు. మహిళలపై అఘాయిత్యాలు చేస్తున్న నిందితులు.. బహిరంగంగా తిరుగుతున్నా.. బీజేపీ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు అఖిలేష్‌. అత్యాచార కేసుల్లో త్వరగా తీర్పులు చెప్పాలన్న వాదనతో సుప్రీంకోర్టు చీఫ్‌ జస్టిస్‌ బాబ్డే విభేదించారు. జస్టిస్‌ అనేది ప్రతీకారంగా మారితే న్యాయం తీరు మారిపోతుందని అభిప్రాయపడ్డారు సీజే. లక్నోతోపాటు ఉన్నావ్‌లలో కాంగ్రెస్‌, ఎన్.ఎస్.యు.ఐలు చేపట్టిన ఆందోళన ఉద్రిక్తతలకు దారితీశాయి. నిరసనకారులను లాగిపడేశారు పోలీసులు. మొత్తానికి అత్యాచార బాధితురాలి మృతితో యూపీనే కాదు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. బాధితురాలి కోరిక ప్రకారం ఆ నిందితులను ఉరితీయాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. అమాయక మహిళల మాన ప్రాణాలను బలికొంటున్న నీచులను ఏమాత్రం వదిలిపెట్టకూడదని కోరుకుంటున్నాయి.

Related posts