telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు..

డిసెంబర్ 9.. తెలంగాణ చరిత్రను మలుపు తిప్పిన రోజు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ నుంచి.. ప్రత్యేక తెలంగాణ ఏర్పడాలన్న డిమాండ్‌ విజయ తీరాలకు చేరిన రోజు.. దశాబ్దాలుగా కొనసాగుతూ వచ్చిన తెలంగాణ ఉద్యమం చివరి అంకానికి చేరిన రోజు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంలో డిసెంబర్ 9 ఎంతో ప్రాముఖ్యమైన తేదీగా గుర్తింపు పొందింది. ఎన్నో ఏళ్ల తెలంగాణ రాష్ట్ర సాధన కలను సాకారం చేసే పోరాటానికి.. 2009 డిసెంబర్‌ 9 కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రోజు. ఆ రోజు రాత్రి పార్లమెంట్‌లో అప్పటి మంత్రి చిదంబరం చేసిన ప్రకటన రాష్ట్ర ఆవిర్భావానికి నాంది పలికింది. ఆ తర్వాత ఐదేళ్లకు ఉద్యమానికి ఫుల్‌స్టాప్‌ పడి.. 2014 జూన్ 2న తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది.

KCR ఉద్యమం : –

తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ ఆకాంక్షను కొన్ని రాజకీయ పార్టీలు రాజకీయ అస్త్రంగా వాడుకున్నాయి. కానీ రాష్ట్ర సాధనే ఏకైక లక్ష్యమంటూ ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి గతంలో జరిగిన ఉద్యమాల పరిస్థితి.. నీరుగారిన తీరు పరిశీలించి మలి విడత ఉద్యమాన్ని తనదైన పంథాలో ముందుకు తీసుకెళ్లారు టీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత, ప్రస్తుత సీఎం కేసీఆర్. రాష్ట్ర సాధన ఉద్యమంలో భాగంగా పార్టీ ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నా.. లక్ష్యాన్ని మాత్రం వీడలేదు. కేసీఆర్‌ ఉద్యమం మొదలు పెట్టిన నాటి నుంచి ఉమ్మడి రాష్ట్రంలో రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారిపోయింది.

కేసీఆర్ దీక్ష : –
ఉద్యమం మొదలైన నాటి నుంచి తెలంగాణలో గులాబీ పార్టీ తమ ఉద్యమ లక్ష్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. ఉద్యమంలో అన్ని రాజకీయ పార్టీలు కూడా జై తెలంగాణ నినాదాన్ని అందుకునే స్థాయికి రాష్ట్ర సాధన ఉద్యమాన్ని తీసుకువచ్చింది. రాజకీయ పార్టీలను, ప్రజా సంఘాలు రాష్ట్ర సాధనలో భాగస్వామ్యమయ్యేలా చేసి.. తెలంగాణ ఉద్యమానికి పెద్దన్న పాత్ర పోషించింది టీఆర్ఎస్ పార్టీ. ఉద్యోగాల భర్తీలో తెలంగాణకు అన్యాయం జరుగుతుందన్న డిమాండ్‌తో.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరవధిక నిరాహార దీక్షకు దిగారు.

KCR ఉద్యమం : –

నవంబర్ 29వ తేదీన కేసీఆర్‌ మొదలుపెట్టిన దీక్ష ఉద్యమానికి కొత్త ఊపిరి పోసింది.కరీంనగర్‌లో కేసీఆర్‌ను పోలీసులు అరెస్టు చేయడం.. ఖమ్మం తరలించడం, పోలీసుల అదుపులో ఉన్నా నిరసన దీక్ష కొనసాగించడంతో రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. కేసీఆర్‌ ఆరోగ్యం క్షీణిస్తుండటంతో.. ఖమ్మం నుంచి హైదరాబాద్ నిమ్స్‌కు తరలించింది అప్పటి ప్రభుత్వం. నిమ్స్‌లో యధావిధిగా కేసీఆర్‌ దీక్ష కొనసాగించడంతో.. రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి.

కేంద్రం హామీ : –
ఉద్యమం పతాక స్థాయికి చేరడంతో.. అప్పటి కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని డిసెంబర్ 9న పార్లమెంటులో అధికారికంగా ప్రకటించారు. త్వరలో సంప్రదింపులు మొదలు పెడతామన్న కేంద్ర ప్రభుత్వ హామీతో కేసీఆర్‌ ఆమరణ దీక్షను విరమించారు. అనంతరం చోటుచేసుకున్న రాజకీయ పరిణామాలతో రాష్ట్ర ఆవిర్భావంపై చిక్కుముడులు పడ్డాయి. దీంతో కేసీఆర్ మరోసారి తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టారు.

రాజకీయంగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు పావులు కదిపారు. ఈ ప్రభావంతోనే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి. ఎన్నో ఉద్యమాలు, నిరసనల నడుమ నాలుగన్నర కోట్ల ప్రజల కల సాకారమైంది. దశాబ్దాలుగా సాకారం కాని తెలంగాణ ప్రజల ఆకాంక్ష ఎట్టకేలకు సాకారమైంది. 2 జూన్ 2014 నుంచి కొత్తగా రాష్ట్రం ఆవిర్భవించింది.

Related posts