telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ ఫ్రాంఛైజీలకు జనవరి 20 ఏ చివరి తేదీ… ఎందుకంటే..?

new feature in ipl 2020

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)‌ 2021 సీజన్‌కు ముందు ఆటగాళ్ల వేలాన్ని ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశముందని సమాచారం. మినీ వేలంపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఇప్పటికే ప్రాథమికంగా ఓ నిర్ధారణకి వచ్చేసినట్లు తెలుస్తోంది. మినీ వేలం ఫిబ్రవరి 11న నిర్వహించాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ప్రాథమికంగా నిర్ణయించిందట. ఐపీఎల్ 14వ సీజన్ మార్చి-మే నెల మధ్యలో జరిగే సూచనలు కనిపిస్తుండటంతో.. ఫిబ్రవరిలోనే మినీ వేలం నిర్వహించబోతున్నారు.  సోమవారం సమావేశమైన ఐపీఎల్‌ పాలక మండలి రాబోయే 14వ సీజన్‌ గురించి కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిసింది. ఫ్రాంఛైజీల మధ్య ఆటగాళ్ల బదిలీ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించినట్లు, ఈ నెల 20 లోపు తమకు అవసరం లేదనుకున్న క్రికెటర్లను జట్లు వదిలేసుకోవాలని సూచించినట్లు సమాచారం. జనవరి 20లోపు టోర్నీలోని అన్ని ఫ్రాంఛైజీలు అట్టిపెట్టుకునే ఆటగాళ్లు, వేలంలోకి విడిచిపెట్టే ఆటగాళ్ల జాబితాని అందజేయాల్సి ఉంటుంది. కరోనా వైరస్ వ్యాప్తి తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ సీజన్‌ను భారత్‌లో నిర్వహించేందుకే తొలి ప్రాధాన్యతనిస్తున్నట్లు సమాచారం. అయితే స్వదేశంలో ఐపీఎల్‌ నిర్వహణ ఈ నెల 10 నుంచి ఆరంభమయ్యే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 టోర్నీ విజయవంతం కావడంపై ఆధారపడి ఉంది. కరోనా మహమ్మారి విరామం తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న తొలి దేశవాళీ టోర్నీ ఇదే. ఆరు నగరాల్లో బబుల్‌ నిబంధనలతో నిర్వహిస్తున్న ఈ టోర్నీ.. సజావుగా సాగితే ఐపీఎల్‌ 2021కు ఎలాంటి ఆటంకాలు ఉండకపోవచ్చు. ఐపీఎల్ 2020 సీజన్ యూఏఈ వేదికగా జరిగిన విషయం తెలిసిందే. జనవరి 10 నుంచి సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 ట్రోఫీ ప్రారంభంకానుంది. భారత క్రికెటర్లు శిఖర్ ధావన్, సురేశ్ రైనా, ఇషాంత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తదితరు ఈ టోర్నీలో ఆడబోతున్నారు. కొంత మంది యువ క్రికెటర్లు కూడా ఈ టోర్నీ ద్వారా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 2021కు సంబందించిన మినీ వేలాన్ని ముస్తాక్ అలీ టీ20 ముగిసిన తర్వాత నిర్వహిస్తే.. బాగుంటుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 11న జరగనున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం తర్వాత అధికారిక తేదీలు వెలుబడనున్నాయి.

Related posts