telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు సామాజిక

ఉద్యోగం పేరుతో యువతిని అరబ్ షేక్ లకు అమ్మేసిన ఏజెంట్లు

Gulf

కుర్మగూడ ప్రాంతానికి చెందిన సయీదా మర్యమ్‌కు టోలిచౌకీలో ఉండే ఫాతిమా అనే మహిళా ఏజెంటు ఆస్పత్రిలో పరిచయమైంది. ఖతార్‌ దేశం దోహా ప్రాంతంలో అతి పెద్ద ఆస్పత్రిలో నర్సు ఉద్యోగం ఉందని.. అక్కడికి వెళ్లి ఉద్యోగంలో చేరితే నెలకు రూ. 50 వేలు (భారత కరెన్సీ) సంపాదించవచ్చని నమ్మించింది. ఆమె మాటలు నమ్మిన యువతి దోహా వెళ్లడానికి సిద్ధమైంది. అక్కడికి చేరిన తర్వాత అక్కడ మరో మహిళా ఏజెంట్‌ ఫాతిమా ఆమెను కలిసింది. గోపాల్‌ అనే వ్యక్తి వద్ద కొంత డబ్బు తీసుకొని మర్యమ్‌ను అతడికి అప్పగించింది. అతడు ఆమెను ఓ అరబ్‌షేక్‌ ఇంటికి తీసుకెళ్లాడు. షేక్‌ వద్ద డబ్బు తీసుకొని యువతిని అప్పగించి వెళ్లిపోయాడు. తన ఇంట్లో పనిచేయాలని షేక్‌ మర్యమ్‌కు చెప్పాడు. తాను నర్సునని.. ఇళ్లలో పనిచేయనని చెప్పింది. ఆగ్రహించిన షేక్‌ గోపాల్‌ను పిలిచి మందలించాడు. అతడు ఆమెను తీసుకెళ్లి ఓ గదిలో నిర్బంధించాడు. అప్పటికే మరో ఇద్దరు యువతులు ఆ గదిలో ఉన్నారు. వారిది కూడా తనలాంటి దీనగాధ అని మర్యమ్‌ తెలిపింది. నాలుగు రోజుల పాటు గదిలో ఉంచిన తర్వాత ఆమెను సలీం అనే వ్యక్తి వద్దకు తీసుకెళ్లగా బెదిరించాడు. సలీంతోపాటు ఏజెంట్‌ ఫాతిమా, గోపాల్‌ కలిసి యువతిని వేధించసాగారు.

తమ మాట వినకపోతే అశ్లీల వీడియోలు తీసి హైదరాబాద్‌కు పంపిస్తామని వేధించసాగారు. బాండ్‌పేపర్‌పై సంతకం చేసి మరో అరబ్‌షేక్‌ ఇంట్లో పనిచేయాలని ఒత్తిడి చేశారు. అయినా ఆమె అంగీకరించకపోవడంతో వ్యభిచార గృహానికి విక్రయిస్తామని హెచ్చరించారు. ఎలాగోలా ఫోన్‌ చేసి తల్లికి విషయం చెప్పింది. తన కుమార్తెను రక్షించాలంటూ ఆమె అమ్జదుల్లాఖాన్‌ను సంప్రదించింది. ఆయన విదేశాంగశాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు లేఖ రాయగా ఖతర్‌లోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన రాయబార కార్యాలయ ప్రతినిధులు గోపాల్‌ను అరెస్టు చేశారు. అప్పటికే అతడిపై ఇలాంటి నాలుగు కేసులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అక్కడ యువతిని వేధించిన మరో ఇద్దరిపై కూడా చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమయ్యారు. మోసం చేసిన మహిళా ట్రావెల్‌ ఏజెంట్లపై మాదన్నపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. వారు ఎలాంటి సహకారం అందించకపోగా సరిగా స్పందించలేదని బాధితురాలి తల్లి ఆరోపిస్తున్నారు.

Related posts