టీఆర్‌ఎస్, బీజేపీలపై కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ ఫైర్ అయ్యారు. టీఆర్‌ఎస్సే బురుద రాజకీయం చేస్తోందని..వరద సహాయాన్ని కూడా దోచుకుతిన్నారని ఆరోపణలు చేశారు. మంత్రి కేటీఆర్ చర్చకు సిద్ధమా..? వరద సహాయంపై అవినీతిని నిరూపిస్తామని శ్రవణ్ సవాల్ విసిరారు. వరదలపై బీజేపీ, టీఆర్‌ఎస్ డ్రామాలు ఆడుతున్నాయని మండిపడ్డారు. చెరువుల ఆక్రమణలను తొలిగించే దమ్ముందా? అని ప్రశ్నించారు. అక్రమ నిర్మాణాలను కూల్చేస్తే..గ్రేటర్‌లో కాంగ్రెస్ పోటీ నుంచి తప్పుకుంటుందని దాసోజు శ్రవణ్ ప్రకటించారు. బండ్లగూడలోని సర్కమ్ చెరువులో అక్రమంగా వెలసిన ఓవైసీ స్కూల్‌ను కూల్చే దమ్ముందా అని నిలదీశారు. కరోనా కాలంలో బ్యాంకు ఖాతాలో డబ్బులు వేసిన ప్రభుత్వం…ఇప్పుడు నగదు ఎలా పంచుతోందని అన్నారు. వరదల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని ఎందుకు ఆదుకోవడం లేదని ప్రశ్నించారు. దుబ్బాక ఎన్నికల్లో కాంగ్రెస్ నిమగ్నమైందని మంత్రి కేటీఆర్ మమ్మల్ని అనే ముందు… సీఎం కేసీఆర్ ఎక్కడ పర్యటించారని ప్రశ్నించారు. గ్రేటర్ ఎన్నికల్లో కాంగ్రెస్ మంచి ఫలితాలు సాధిస్తుందని పేర్కొన్నారు.