దర్శకరత్న దాసరి నారాయణ రావు 72 వ జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులు ఆయన సమాది వద్ద పుష్పాగుచ్చాలతో శ్రద్దాంజలి ఘటించారు. కుమార్తె హేమ లయకుమారి, అల్లుడు డాక్టర్ రఘునాథ్ బాబు, మనవుడు ధనుష్ ఆయన విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా అల్లుడు డాక్టర్ రఘునాథ్ మాట్లాడుతూ మామగారు ఎంతో సేవ దృక్పదంతో ఎందరికో చేయూతనిచ్చాడని, నేను కూడా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ తనవంతుగా ఆర్థిక సాయమందించి నీడ ట్రస్ట్ ను ముందుకు తీసుకెళ్తానని అన్నారు.
బాల్యంలో ఎంతో కష్టపడి విద్యావంతుడైన దాసరి ప్రతి ఒక పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేదుకు ట్రస్ట్ ద్వారా ఆర్టిక సాయం అందించారని తెలిపారు. గత పది సంవత్సరాలుగా 7 నుంచి 8 లక్షల వరకు ఆర్థిక సహాయం చేసి పలువురిని ఆడుకున్న మహావ్యక్తి దాసరి నారాయన్ రావు అని అన్నారు. పరిశ్రమలో వెనుక బడిన ఆర్టిస్టులకు ప్రతినెలా వేతనంలా డబ్బులు పంపించిన దయాహృదయుడు దాసరి అని ప్రశంసించారు.
నిరుపేద కుటుంబంలో మే 4, 1947లో పాలకొల్లులో జన్మించిన దాసరి అనేక కష్టాలుపడి, ఎందరో సహాయంతో చదువుకున్నారు. చిన్నతనం నుంచి దాసరికి నాటకాలు అంటే ఎంతో ఇష్టమని. ఆ ఇష్టమే ఆయనను సినీ రంగంలోకి తీసుకెళ్లింది. దాసరి శ్రీమతి పద్మను వివాహం చేసుకున్నా అనంతరం ఆయన జీవితం మలుపు తిరిగింది.
ఆమెతో మద్రాస్ వెళ్ళి రచయితగా, సహాయ దర్శకుడుగా పని చేసిన ఆయన 1972 లో తాతా మనవడు సినిమాతో దర్శకుడయ్యారు. ముఖ్యంగా తెలుగు సినిమా పై దాసరి వేసిన ముద్ర ఎన్నటికీ చెరిగిపోనిది. రచయిత, కవి, నిర్మాత , నటుడు, దర్శకుడు , పత్రికాధిపతుడు, కేంద్ర మంత్రిగా ఆయన పలు రంగాల్లో రాణించారు.