ప్రముఖ కొరియోగ్రాఫర్ శివ శంకర్ మాస్టర్ కరోనా సోకడంతో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గత కొద్దిరోజులుగా కరోనాతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో ఆదివారం రాత్రి 8 గంటల సమయంలో కన్నుమూశారు. ఆయన వయసు 72 సంవత్సరాలు. ఆయనకు భార్య సుకన్య ఇద్దరు కుమారులు విజయ్ శివ శంకర్ , అజయ్ శివ శంకర్ వున్నారు.
ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. శివ శంకర్ మాస్టర్ అనారోగ్యతో హైదరాబాద్ లోని ఏ ఐ జి ఆసుపత్రిలో చేరారు . ఆయన కోలుకుంటారని అందరూ భావిస్తున్న సమయంలో ఈరోజు మరణించారని వార్త తెలుగు సినిమా రంగాన్ని కలచివేసింది.
డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు.
పది భాషల్లో 800 చిత్రాలకు పైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. టీవీ రంగంలో కూడా అనేక షో లకు జడ్జిగా వున్నారు . 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.