telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

దగ్గుబాటి కుటుంబం .. వైసీపీలోకి.. సీఎం ఆదేశాలు..

daggubatipurandeswari

ఎన్నికల ముందు అన్ని వర్గాల ప్రజలను, వ్యక్తులను చేరదీస్తుంటారు రాజకీయ నేతలు. ఎవరిలో ఏ సత్తా ఉందో, ఎవరి సామర్థ్యం ఎంతవరకు పార్టీని గెలుపు తీరాలకు చేరుస్తుందో స్పష్టత లేక అందరితో సఖ్యతగా ముందుకు వెళ్తుంటారు. అదే ఎన్నికలు ముగిసిన తర్వాత, ఫలితాలు వెలువడిన తర్వాత ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టేస్తారు. ఎన్నికల ముందు ఒకటికి పదిసార్లు భేటీ అయిన నేతలకు ఎన్నికల తర్వాత అసలు గేటులోపలికి రానివ్వని పరిస్ధితులు కూడా తలెత్తుతాయి. ప్రస్తుతం ఏపి రాజకీయాల్లో ఇలాంటి పరిణామాలే చోటుచేసుకుంటున్నాయి. దగ్గుబాటి పురంధేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ పేర్లకు పెద్దగా ఉపోద్ఘాతాలు అవసరం లేదు. కొన్ని ఏళ్ల నుంచి రాజకీయాలను శాసిస్తున్న కుటుంబాల నుంచి వచ్చిన దంపతులు వీరు. ఏపీ రాజకీయాల్లో ప్రస్తుతం రెండు వేర్వేరు పార్టీల్లో కొనసాగుతున్న దంపతులు దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురంధేశ్వరిలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. పురందేశ్వరి బీజేపీలో కొనసాగుతుండగా ఆమె భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీలో ఉన్నారు. ఇద్దరూ గత ఎన్నికల్లో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరుచూరు నుంచి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా, ఆయన భార్య పురందేశ్వరి విశాఖ నుంచి ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

ఎన్నికలకు ముందు భార్యాభర్తలు చెరో పార్టీలో కొనసాగేందుకు అభ్యంతరం చెప్పని వైసీపీ, ఇప్పుడు ఏదో ఒక పార్టీని ఎంచుకోవాలని, పురందేశ్వరితో బీజేపీకి రాజీనామా చేయించాలని దగ్గుబాటిపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. కొద్ది కాలంగా బీజేపీ ఏపీలో జగన్ సర్కారును టార్గెట్ చేసి విమర్శలు చేస్తోంది. ఆ క్రమంలోనే పురంధేశ్వరి కూడా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలతో విరుచుకు పడుతున్నారు. గతంలో పరుచూరులో వైసీపీ ఇన్ చార్జ్ గా ఉండి, దగ్గుబాటి చేరిక తరువాత, టీడీపీలోకి వెళ్లిపోయిన రావి రామనాథం బాబు, ఎన్నికల తరువాత తిరిగి వైసీపీలో చేరారు. ఆపై ఆయనే నియోజకవర్గంలో క్రియాశీలకంగా పనిచేస్తున్నారు. పార్టీ పనులన్నీ ఆయనకే అప్పగిస్తున్నారు కూడా. దాదాపు ఇప్పుడు దగ్గుబాటికి పార్టీలో నామమాత్రపు గుర్తింపు కూడా లేదని తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్న దగ్గుబాటి, తన అనుచరులతో మొత్తం పరిణామాలపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది.

దగ్గుబాటి వెంకటేశ్వరరావు వ్యవహారం పార్టీలో, ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చర్చనీయమవుతోంది. దీనిపై వివరణ ఇచ్చుకోవడానికి వెంకటేశ్వరరావు కొద్దికాలంగా జగన్‌ను కలవాలనుకుంటున్నట్టు చర్చ జరుగుతోంది. ఏపీ సీఎం వైఎస్ జగన్ అపాయింట్ మెంట్ లభిస్తే ఆయనతో మాట్లాడి తుది నిర్ణయం తీసుకుంటానని చెబుతున్నారట. జగన్ ఒప్పుకుంటే సరేసరి లేదంటే తానే పార్టీని వీడాలని భావిస్తున్నట్టు దగ్గుబాటి అనుచరులు చెప్పుకొస్తున్నారు. పురంధేశ్వరి మాత్రం పార్టీ మారేందుకు ససేమిరా అంటున్న అంశం పట్ల మాత్రం స్పష్టత వచ్చినట్టు సమాచారం.

Related posts