telugu navyamedia
రాజకీయ

టాటా సన్స్​ మాజీ ఛైర్మన్​ మిస్త్రీ దుర్మ‌ర‌ణం ..

ప్రముఖ వ్యాపారవేత్త, టాటా గ్రూప్‌ మాజీ ఛైర్మన్‌ సైరస్‌ మిస్త్రీ ఇక లేరు. మహారాష్ట్ర ముంబయి సమీపంలోని పాల్ఘర్​ జిల్లాలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు.

అహ్మదాబాద్​ నుంచి ముంబయి వెళ్తుండగా.. ఆయన ప్రయాణిస్తున్న మెర్సిడెస్​ కారు డివైడర్​ను ఢీకొట్టింది. వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మరణించారని వైద్యులు ధ్రువీకరించారు.

ప్రమాదం జరిగిన సమయంలో ఆయనతో సహా కారులో డ్రైవర్​, మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారని పోలీసులు వెల్లడించారు. గాయాలైన ఇద్దరిని.. గుజరాత్​లోని ఆస్పత్రికి తరలించారు.

మిస్త్రీ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖాసా రూరల్​ ఆస్పత్రికి తరలించారు. కారు డ్రైవర్​ నియంత్రణ కోల్పోవడంతోనే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని పోలీసులు వివరించారు.

1968 జులైలో జన్మించిన సైరస్​ పల్లోంజీ మిస్త్రీ.. యూకేలోని ఇంపీరియల్ కాలేజ్‌లో సివిల్ ఇంజనీరింగ్‌, లండన్ బిజినెస్ స్కూల్‌లో మేనేజ్‌మెంట్‌లో ఎమ్ఎస్‌సీని చేశారు.. 2006లో టాటా గ్రూపు బోర్డులో చేరారు.

2012లో రతన్ టాటా పదవీ విరమణ చేసిన తర్వాత టాటా గ్రూప్​కు సైరస్‌ మిస్త్రీ ఛైర్మన్‌ అయ్యారు. అప్పటికి 43 ఏళ్ల సైరస్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్ కంపెనీలో మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. టాటా సన్స్ హోల్డింగ్స్ షాపూర్జీ పల్లోంజీ గ్రూప్​కు 18 శాతం వాటా ఉంది.

అయితే రతన్ టాటాతో విభేదాల కారణంగా ఆయన్ను బయటకు పంపించారు. ఆయనకు నిర్దేశించిన వివిధ లక్ష్యాలను చేరడంలో విఫలమయ్యారని ఆరోపణలున్నాయి. అదే సమయంలో గ్రూపు ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తించారన్న వాదనలూ ఉన్నాయి.

టాటా సన్స్‌లో 18.4 శాతం వాటా ఉన్న మిస్త్రీ.. తన తొలగింపు విషయంలో ఉదాసీనంగా ఉండలేకపోయారు. తొలగింపును సవాలు చేస్తూ నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్​కు (ఎన్‌సీఎల్‌టీ) వెళ్లారు. రతన్‌ టాటాతో పాటు టాటా సన్స్‌లోని మరో 20 మందిపైనా తన రెండు ఇన్వెస్ట్‌మెంట్‌ కంపెనీలైన సైరస్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌, స్టెర్లింగ్‌ ఇన్వెస్ట్‌మెంట్స్‌ల ద్వారా కేసు దాఖలు చేశారు. అయితే ఈ ఆరోపణలను పరిశీలించడానికి సైతం అర్హత లేదని ఎన్‌సీఎల్‌టీ తోసిపుచ్చింది.

అయితే మిస్త్రీ ఈ ఆదేశాలను సవాలు చేస్తూ ఎన్‌సీఎల్‌ఏటీకి వెళ్లారు. మూడేళ్ల న్యాయపోరాటంలో గెలుపు సైరస్‌ మిస్త్రీని వరించింది. ఆ తర్వాత టాటా సన్స్‌ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా మిస్త్రీని తిరిగి నియమించాలంటూ జాతీయ కంపెనీ లా అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ జారీ చేసిన ఆదేశాలను 2021 మార్చి 26న సుప్రీంకోర్టు పక్కన పెట్టింది.

ప్రస్తుతం షాపూర్ జి, పల్లోంజి సంస్థల బాధ్యతలను చూసుకుంటున్నారు. సైరస్ తండ్రి, వ్యాపార దిగ్గజం పల్లోంజీ మిస్త్రీ (93) ఈ ఏడాది జూన్ 28న కన్నుమూశారు. సైరస్ మరియు అతని తండ్రి మరణం తరువాత, అతను అతని తల్లి ప్యాట్సీ పెర్రిన్ దుబాస్, షాపూర్ మిస్త్రీ మరియు ఇద్దరు సోదరీమణులు లైలా మిస్త్రీ మరియు అల్లు మిస్త్రీలతో సైరస్ ఉంటున్నారు. అయితే ఇంతలోపే ఆయన కన్నుమూశారు.

Related posts