telugu navyamedia
క్రైమ్ వార్తలు తెలంగాణ వార్తలు

ఒళ్లు గగుర్పొడిచే యాక్సిడెంట్‌ వీడియో షేర్‌ చేసిన పోలీసులు

సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు ఒళ్లు గగుర్పొడిచే ఓ వీడియో షేర్‌ చేశారు. ‘‘దీని ద్వారా మీరు ఏం గమనించారు’’ అనే క్యాప్షన్‌ ఇచ్చారు. బాచుపల్లి ప్రాంతంలో చోటు చేసుకున్న ఈ యాక్సిడెంట్‌ వీడియోలో ఇది. రోడ్డు మీద కొన్ని వాహనాలు వెళ్తుంటాయి. పెద్దగా రద్దీగా కూడా లేదు. రోడ్డు మీద లారీ, ఇన్నోవా వెళ్తుంటాయి. ఈ రెండింటి మధ్య ఓ వ్యక్తి బైక్‌ మీద వెళ్తుంటాడు. ఈ క్రమంలో ఇన్నోవాకు ముందు ప్రయాణిస్తున్న ఆటో.. దానికి దారి ఇవ్వడం కోసం కొద్దగా ముందుకు వెళ్లి ఓ పక్కకు ఆగుతుంది.

ఇక అంతసేపు ఇన్నోవాకు అతి సమీపంలో ఉన్న బైకర్‌.. ఓవర్‌ టేక్‌ చేసేందుకు ప్రయత్నిస్తూ.. లారీ ముందుకు వెళ్తాడు. అయితే ఇది గమనించని లారీ డ్రైవర్‌ ఫాస్ట్‌గా వెళ్లడంతో బైక్‌ను ఢీ కొడతాడు. దాంతో ఆ‍ వ్యక్తి ఎగిరి లారీ కింద పడి కొద్ది దూరం వెళ్తాడు. లారీలోని వ్యక్తి ప్రమాదాన్ని గుర్తించి కిందకు దిగి చూస్తుంటాడు. ఇంతలో లారీ కొంచె దూరం వెనక్కి కదిలి.. దాని కిందే ఉన్న బైకర్‌ మీదుగా కొంచెం దూరం వెళ్తుంది. కింద ఉన్న వ్యక్తి హెచ్చరించడంతో లారీని ఆపుతాడు. ఓవర్‌టేక్‌ చేయాలనే అర సెకను కోరిక.. బైకర్‌కి.. అతని కుటుంబానికి తీరని శోకాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆరోగ్యం ఎలా ఉందనే దాని గురించి వీడియోలో ఎలాంటి సమాచారం లేదు.

ప్రజలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడం కోసం ఈ వీడియో ను షేర్‌ చేశామని.. ఇతరుల అనుభవం నుంచి మనం పాఠాలు నేర్చుకోవచ్చు అంటూ సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు తమ ట్విటర్‌లో దీన్ని షేర్‌ చేశారు. ఈ వీడియో చూసిన వారంతా బాధితుడిది, ఇన్నోవా డ్రైవర్‌దే తప్పని విమర్శిస్తున్నారు.

Related posts