telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

సైబరాబాద్ సీపీ సజ్జనార్ బదిలీ

సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ బదిలీ అయ్యారు. మూడేళ్ల నుంచి సైబరాబాద్ సీపీగా పనిచేస్తున్న సజ్జనార్‌ను ఆర్టీసి ఎండీగా నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. సజ్జనార్‌ స్థానంలో సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌గా 1999 బ్యాచ్‌కు చెందిన ఐపీఎస్ అధికారి స్టీఫెన్ రవీంద్రను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

నిన్న ఇంటెలిజెన్స్ చీఫ్‌గా అనిల్ కుమార్‌ను నియమించిన ప్రభుత్వం మరుసటి రోజే సైబరాబాద్ సీపీని బదిలీ చేసింది. మరికొన్ని బదిలీలు కూడా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సైబరాబాద్ పోలీస్ కమిషనర్‌ సజ్జనార్‌ సంచలన కేసులను చేధించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా మహిళల రక్షణకువినూత్నమైన కార్యక్రమాలు కూడా చేపట్టారు.

ఆయన 1996 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఇటీవలే ఆయన అడిషనల్ డీజీ ర్యాంకు ప్రమోషన్ పొందారు. వరంగల్ యాసిడ్ దాడి కేసులో ఎన్‌కౌంటర్, శంషాబాద్ దిశ ఎన్‌కౌంటర్‌లు సజ్జనార్‌ను దేశవ్యాప్తంగా వార్తల్లో నిలిచేలా చేశాయి. దిశ నిందితుల ఎన్‌కౌంటర్ అప్పట్లో సంచలనంగా మారింది. సీపీ సజ్జనార్‌పై ప్రశంసల వర్షం కురిసింది. మల్టీ లెవెల్ స్కామ్‌లను ఛేదించడంలో సజ్జనార్‌కు మంచి పేరుంది. కరోనా సమయంలో ప్లాస్మా డొనేషన్‌లో విశేష సేవలు అందించారు.

Related posts