విదేశాల్లో ఉద్యోగం అనగానే ముందు వెనుక ఆలోచించకుండా కొందరు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని సైబర్‌నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతారు. ఇలాంటి ఘటన తాజాగా హైదరాబాద్ నగరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే కెనడాలో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఓ స్టాఫ్ నర్సును నమ్మించిన సైబర్‌నేరగాళ్లు రూ.7లక్షలు టోకరా వేశారు. కార్వాన్కు చెందిన అన్షు(పేరు మార్చాం) అనే ఓ స్టాఫ్ నర్సుకు ఈ-మెయిల్ ద్వారా కెనడాలోని రోస్ మెమోరియల్ దవాఖానలో ఉద్యోగం ఉందంటూ సంప్రదించడంతో నేను సిద్ధమంటూ ఆమె రిైప్లె పంపించింది. దీంతో ఇరువురు ఫోన్ నంబర్లు ఇచ్చుకున్నారు. ఉద్యోగం గురించి మాట్లాడారు. సోనియా విల్సన్, లల్ఫమ్కిమ్, ఐలోటో, బెసన్ హలాల్ విన్సెంట్ అడెమ్, టోని జసన్, చింగో పేరుతో ఆమెతో మాట్లాడారు.
ఉద్యోగం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని, ఆ తరువాత ఇంటర్వ్యూ అంటూ ఆమెను నమ్మించారు.ముందుగా కొంత డబ్బు చెల్లించిన తరువాత ఉద్యోగం కోసమని ఆఫర్ లెటర్ పంపించారు. కెనడాలో ఉద్యోగం కోసం ఎల్ఐఎంఏ సర్టిఫికెట్, ఇన్సూరెన్స్ పేపర్లు పంపించారు. ఇవన్ని ఢిల్లీలోని కెనడా ఎంబసీ నుంచి జారీ అయినట్లు లెటర్ హెడ్లు, లోగోలు తయారు చేసి పంపించారు. ఇలా ప్రతి దానికి కొంత డబ్బు కావాలంటూ మొత్తం రూ.7,11,700 వివిధ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేయించారు. వీరు చెప్పే మాటలపై అనుమానం వచ్చిన అన్షు ఢిల్లీలోని కెనడా ఎంబసీకి వెళ్లి ఆరా తీసింది. గేట్ వద్దనే ఇవన్నీ నకిలీవని, మిమ్మల్ని ఎవరో మోసం చేశారంటూ అక్కడున్న సిబ్బంది సూచించడంతో బాధితురాలు హైదరాబాద్‌కు తిరిగి వచ్చి సీసీఎస్ సైబర్‌క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.