దుబాయ్ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన ఓ ప్రయాణికుడి వద్ద భారీగా బంగారం పట్టుబడింది. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్‌ఐ)కి చెందిన ఎయిర్‌పోర్ట్ ఇంటెలిజెన్స్ యూనిట్ (ఏఐయూ) విభాగం జరిపిన తనిఖీల్లో ఇస్త్రీపెట్టెలోని విడిభాగాల రూపంలో తీసుకువస్తున్న 9 కిలోల బంగారాన్ని గుర్తించారు. నిందితుడిని బంగారం అక్రమ రవాణాదారుడిగా గుర్తించారు. పక్కా సమాచారం అందుకున్న ఏఐయూ బృందాలు దుబాయ్ నుంచి వచ్చిన ఈకే-528 విమానంలో వచ్చిన ప్రయాణికులను జల్లెడపట్టారు. ఓ ప్రయాణికుడి లగేజీలో మూడు సాధారణ ఇస్త్రీపెట్టెలు ఉండటంతో వాటిని తెరిచి పరిశీలించారు. బంగారాన్ని కరిగించి, ఇస్త్రీపెట్టెల్లోని విడిభాగాల మాదిరిగా తయారు చేసినట్లు గుర్తించారు. వాటిల్లో మొత్తం 9.3 కిలోల బంగారం ఉన్నట్లు తేల్చారు. దీని విలువ రూ. 3.48 కోట్లుగా ఉంటుందని విలేకరులకు తెలిపారు.
previous post