telugu navyamedia
ట్రెండింగ్ సామాజిక

మొసళ్ల గ్రామం.. ఇక్కడ ముసళ్లే పెంపుడు జంతువులు..

crocodile village in gujarat state

మొసళ్ళు అంటేనే బయపడి ఆమడ దూరం పారిపోతాం. కానీ ఒక గ్రామం మొత్తం ముసళ్ళతో జీవిస్తున్నారంటే.. దానిలో ఒక ప్రత్యేకత ఏదో ఒకటి ఉండేఉంటుంది. అలాంటి గ్రామం ఎక్కడ ఉంది అంటే.. గుజరాత్‌లోని కొన్ని గ్రామాల్లో స్థానికులు అత్యంత ప్రమాదకరంగా భావించే మగ్గర్ మొసళ్ల పక్కపక్కనే తిరుగుతుంటారు.

మొసళ్లు సుమారు పది గంటలకు బయటికొస్తాయట. మలతాజ్ గ్రామంలో ఆ మహిళ ఇంటి గుమ్మం ముందున్న ఒక నీటి మడుగు, అది మామూలు నీటి గుంటలాగే ఉంది. కానీ పాచిపట్టి పచ్చగా కనిపిస్తున్న ఆ నీళ్లలో అక్కడక్కడా మగ్గర్ మొసళ్లు కనిపిస్తున్నాయి. భారత్‌లో కనిపించే మూడు మొసళ్ల జాతుల్లో ఇది ఒకటి. “వాటితో కలిసి జీవించడం తమకు అలవాటైపోయింది” అని అక్కడివారు చెప్పారు.

సాధారణంగా ఎక్కడైనా మొసలి కనిపిస్తే చాలు.. స్థానికులు భయంతో పరుగులు తీస్తారు. కానీ సబర్మతి, మాహీనదుల మధ్య 4 వేల చదరపు కిలోమీటర్ల చారోతర్ ప్రాంతంలో కనీసం 200 మగ్గర్ మొసళ్లు ఉన్నాయి. చారోతర్‌లో ఉన్న 30 గ్రామాల్లో నీటి గుంటల్లో ఇవి జీవిస్తున్నాయి. వాలంటరీ నేచర్ కన్జర్వన్సీ అనే స్థానిక స్వచ్ఛంద సంస్థ సర్వే ప్రకారం ఈ ప్రాంతంలో ఒక చదరపు కిలోమీటరుకు 600 మంది నివసిస్తున్నారు.

‘మొసళ్లు ఉన్నాయి జాగ్రత్త’ అనే బోర్డు ప్రతి నీటి గుంట దగ్గరా కనిపిస్తుంది. కానీ గ్రామస్థుల రోజువారీ కార్యకలాపాల్లో ఇవి కూడా ఒక భాగమైపోయాయి. స్థానికులు రోజూ ఆ బోర్డులను పట్టించుకోకుండా ఆ నీళ్లలో దిగి స్నానం చేయడం, బట్టలు ఉతకడం, పశువులను కడగడం చేస్తుంటారు. అదే సమయంలో మొసళ్లు ఆ గుంటల్లో అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి. చేపలను పట్టుకుని పిల్లలకు అందిస్తుంటాయి. తర్వాత ఒడ్డుకు చేరి ఎండలో నిద్రపోతాయి. అవి ఉన్న ప్రాంతంలో పశువులు గడ్డిని మేస్తుంటాయి. అక్కడే పిల్లలు ఆడుకుంటూ ఉంటారు.

చారోతర్ అంటే గుజరాతీలో ‘బంగారు కుండ’ అని అర్థం. ఇక్కడ ఎటుచూసినా కిలోమీటర్ల వరకూ పొగాకు తోటలే కనిపిస్తాయి. ఇక్కడ గతంలో వన్యప్రాణులను సంరక్షించినట్టు ఎలాంటి ఛాయలూ లేవు. అయితే ఈ మొసళ్లన్నీ ఎక్కడ్నుంచి వచ్చాయి? కొంతమంది అవి ఎప్పుడూ అక్కడే ఉన్నాయని చెబుతారు. ఇంకొంత మంది మాత్రం 18వ శతాబ్దం నుంచి స్వతంత్రం వచ్చేవరకూ ఆ ప్రాంతాన్ని పాలించిన గైక్వాడ్ రాజులు వేట కోసం మొసళ్లను ఆ గుంటల్లో వదిలారంటారు. కానీ దానికి ఎలాంటి చారిత్రక ఆధారాలూ లేవు. కానీ మగ్గర్ మొసళ్లు ఇక్కడికి ఈ మధ్యలో వచ్చినవి కాదు అనేది మాత్రం నిజం.

కానీ చారోతర్‌లో ఉన్న మగ్గర్ మొసళ్ల ప్రవర్తన చాలా అసాధారణంగా ఉంటుంది. మొసళ్లలో ఇది మూడో అత్యంత ప్రమాదకరమైన జాతి. మొసళ్ల దాడులపై ‘క్రోక్‌బైట్’ విడుదల చేసిన గణాంకాల ప్రకారం 2018లో ప్రపంచవ్యాప్తంగా మగ్గర్ మొసళ్లు 18 మంది ప్రాణాలు తీశాయి. చారోతర్‌ నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉండే విశ్వామిత్రి నదిలో ఇవి 2011-12లో ఇద్దరిని చంపాయి, మరో 8 మందిని గాయపరిచాయి.

స్థానికులకు అప్పుడప్పుడూ వాటితో చిన్న సమస్యలు కూడా వస్తుంటాయి. పెటిల్ గ్రామంలో మడుగు దగ్గరే ఉండే ఒక కుటుంబానికి చెందిన మేకను మగ్గర్ మొసళ్లు తినేశాయి. కానీ ఆ ఇంటి పెద్ద మాత్రం “అది ఆ మొసళ్లకే రాసిపెట్టి ఉందేమో, అందుకే అవి తినేశాయి” అంటారు. వేసవి వేడి నుంచి తప్పించుకోడానికి ఈ మొసళ్లు తీరంలో బొరియలు తవ్వి అందులో ఉంటాయి. కొన్నిసార్లు అవి రోడ్డు వరకూ తవ్వుకుంటూ వచ్చేయడంతో వాహనాలు వెళ్లినపుడు అది కూలి ప్రాణాలు కోల్పోతున్నాయి. ఈ బొరియల వల్ల గట్టున ఉండే కొన్ని ఇళ్లు కూడా కూలిపోయాయి. మొసళ్ల వల్ల ఎన్ని ఇబ్బందులు వస్తున్నా.. చారోతర్ ప్రజలు మాత్రం మగ్గర్ మొసళ్లను చూసి గర్వపడుతుంటారు. ఈ ప్రాంతంలో అత్యధిక మొసళ్లు దేవా గ్రామంలో ఉన్నప్పటికీ, మలతాజ్ గ్రామానికి ‘మొసళ్ల గ్రామం’ అనే పేరొచ్చింది.

crocodile village in gujarat stateఇక్కడ ఉన్న వారు చనిపోయిన మొసళ్లకు అంత్యక్రియలు కూడా చేస్తారు. మొసలితో కనిపించే ఖొడియార్ దేవతకు గుడి కూడా కట్టారు. ఈ ప్రాంతంలో మనుషులు, మొసళ్ల మధ్య అంత సఖ్యత ఉండడానికి ఆ దేవతే కారణం అని అక్కడ ఉన్నవారు భావిస్తారు. ఇక్కడ జరిగిన సర్వేలో స్థానికులు చాలా మంది మొసళ్లంటే తమకు ఇష్టమని చెప్పారు. “మొసళ్ల సంఖ్య పెరుగుతుండడంతో వాటి కోసం కొత్తగా ఒక మడుగు కూడా తవ్వించబోతున్నాం” అని గ్రామ సర్పంచ్ దుర్గేష్ భాయ్ పటేల్ చెప్పారు.

Related posts