telugu navyamedia
క్రీడలు వార్తలు

ఐపీఎల్ కోసం ముందుకు జరిగిన సీపీఎల్‌…

ఐపీఎల్ కోసం బీసీసీఐ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. వెస్టిండీస్‌ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం కానుంది. బీసీసీఐ విజ్ఞప్తి మేరకు కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (సీపీఎల్‌) తేదీలను ముందుకు జరిపేందుకు వెస్టిండీస్‌ క్రికెట్ బోర్డు అంగీకరించింది. 7 నుంచి 10 రోజులు ముందుకు జరపాలని నిర్ణయించిందని సమాచారం తెలిసింది. ఐపీఎల్ 2021 రెండో దశ యూఏఈలో జరగనున్న విషయం తెలిసిందే. పలు జట్లలో కరోనా వైరస్‌ కేసులు రావడంతో ఐపీఎల్‌ 2021 సీజన్‌ సగంలోనే ఆగిపోయిన సంగతి తెలిసిందే. నిరవధికంగా వాయిదా పడిన సీజన్‌ను సెప్టెంబర్‌ 19 నుంచి అక్టోబర్‌ 15 వరకు యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఆ సమయంలో ద్వైపాక్షిక సిరీసులు ఉండటంతో.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ క్రికెటర్లు వచ్చే అవకాశాలు దాదాపు కనిపించడం లేదు. దేశానికే తొలి ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉంటుందని ఆయా బోర్డులు ఇప్పటికే ఆటగాళ్లకు స్పష్టం చేశాయి. జాతీయ జట్టుకు ఎంపికవ్వని వాళ్లు మాత్రం ఐపీఎల్ ఆడుకోవచ్చని చెప్పాయి. ఐపీఎల్ 2021 సమయంలో వెస్టిండీస్‌కు ద్వైపాక్షిక సిరీసులు లేనప్పటికీ.. ఆగస్టు 28 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు సీపీఎల్‌ 2021 నిర్వహిస్తామని విండీస్‌ క్రికెట్ బోర్డు ప్రకటించింది. దాంతో విండీస్ స్టార్లు ఐపీఎల్‌ 2021కు వచ్చేందుకు కుదరడం లేదు. దాంతో సీపీఎల్‌ను కొన్నిరోజులు ముందుకు జరపాలని బీసీసీఐ ఇటీవల కోరింది. మొదటగా కుదరకపోవచ్చని చెప్పిన విండీస్‌.. తాజాగా బీసీసీఐ కోరికపై మరోసారి చర్చించింది. టోర్నీ తేదీలను ముందుకు జరిపేందుకే అంగీకరించింది. దాంతో వెస్టిండీస్‌ క్రికెటర్ల రాకకు మార్గం సుగమం అయింది.

Related posts