ఈ నెల 19న పౌరసత్వ చట్ట సవరణకు వ్యతిరేకంగా వామపక్షాల ఆధ్వర్యాన దేశవ్యాప్త నిరసనను జయప్రదం చేయాలని సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు వి.శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. చట్ట సవరణకు వ్యతిరేకంగా విజయవాడ లెనిన్ సెంటర్‌లో సిపిఎం ఆధ్వర్యాన శుక్రవారం నల్ల చొక్కాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ ఇది కేవలం ముస్లింలకే కాదని భారతీయులందరి సమస్యని అన్నారు. దేశప్రజలు మళ్లీ భారతీయులుగా నిరూపించుకోవాల్సి రావడం దారుణమని అన్నారు. వైసిపి, టిడిపి ఎంపీలు బిజెపికి ఎందుకు మద్దతిచ్చారో ప్రజలకు వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మద్దతు వల్ల రాష్ట్రానికి కలిగే లాభాలేమిటో తెలపాలన్నారు. చరిత్రలో ఎప్పుడూ ఏ దేశమూ మత ప్రాతిపదికన పౌరసత్వం ఇవ్వలేదని తెలిపారు. దేశపరిపాలన కర్ఫ్యూలు,.నిరసనలు, బంద్‌ల మధ్య సాగుతోందని ఆయన విమర్శించారు.
పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు బాబూరావు మాట్లాడుతూ బిజెపి మంద బలంతో పౌరసత్వ చట్ట సవరణ బిల్లును ఆమోదింపజేసిన రోజు దేశ చరిత్రలో చీకటి రోజుగా మిగిలిపోతుందన్నారు. ఇలాంటి బిల్లును ప్రవేశపెట్టడమంటే మత సమానత్వ భావనను సమాధి చేయడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. రాజ్యాంగ స్పూర్తిని గౌరవించకుండా మహాత్ముడి భావనలను మరోసారి ఖూనీ చేశారని మండిపడ్డారు. మత ఉన్మాదాన్ని రెచ్చగొట్టి భారత్‌ను మరో పాకిస్తాన్‌గా మార్చాలని బిజెపి చూస్తోందని తెలిపారు. అప్పట్లో మహమ్మద్ జిన్నా ఎలాగో ఇప్పుడు భారత్‌కు మోడీ, అమిత్‌షాలు అలా తయారయ్యారని తెలిపారు. ఆర్థిక మాంధ్యం, ధరల పెరుగుదల వంటి సమస్యల నుండి దేశ ప్రజల దృష్టి మరల్చడానికి బిజెపి చేస్తున్న మరో కుట్రని ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వెంకటేశ్వర్లు, సిపిఎం జిల్లా నాయకులు డివి. కృష్ణ, దోనేపూడి కాశీనాధ్, కార్యకర్తలు పాల్గొన్నారు.