తెలుగు రాష్ట్రాల్లోనూ బుల్లితెరపై వస్తున్న బిగ్‌బాస్ రియాల్టీ షోకు ఎంత క్రేజీ ఉందో స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ రియాలిటీ షో ఎంతో మంది ప్రేక్షక అభిమానులను సొంతం చేసుకుంది. అయితే సినీ రాజకీయ వర్గాల నుండి విమర్శలు కూడా అంతే వస్తున్నాయి.
బిగ్‌బాస్’ కార్యక్రమం ఓ బ్రోతల్ స్వర్గమని, రెడ్‌లైట్ సంస్కృతిలాంటిదని , యువతని చెడు ధోరణిలో తీసుకెళ్తుందని మరోసారి సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ నిప్పులు చెరిగారు. బిగ్‌బాస్ హౌస్‌లో యువతీయువకులను 105 రోజులు ఒకే గదిలో పెడుతున్నారన్నారు. లోపల ముద్దులు పెట్టుకుంటున్నారని, డేటింగ్ చేయిస్తున్నారని, ఇది సాంస్కృతి క దోపిడీ అని ఆరోపించారు. ఆ కార్యక్రమాన్ని 24 గంటలూ ప్రత్యక్ష ప్రసారం చేయగలరా? అని సవాల్ విసిరారు.
బిగ్ బాస్ అంటే బూతు ప్రోగ్రాం అని, ఇలాంటి చెత్త షోలను నాగార్జున హోస్టుగా ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారో అర్ధం కావటం లేదు. ఇలాంటి బూతు షోలకి అసలు అనుమతులే ఇవ్వొద్దని… ఈ కార్యక్రమం ద్వారా సమాజానికి ఏ సందేశం ఇస్తున్నారని నిలదీశారు. నేను బిగ్ బాస్ కి వ్యతిరేకంగా కోర్టుల్లో కేసులు కూడా వేశాను. నాకు అక్కడ కూడా న్యాయం దొరకలేదు. ఇలాంటి అనైతిక విధానాలను కేంద్ర ప్రభుత్వం అనుమతించడం సరికాదని కోర్టులో వ్యాజ్యం వేసినా న్యాయవ్యవస్థ కూడా సహకరించడం లేదని వాపోయారు.
ఇలాంటి వాటి పట్ల పోలీస్ డిపార్ట్‌మెంట్ కూడా సాయం చేయదు. కేంద్ర ప్రభుత్వం ఇట్లాంటి పనికిమాలిన అనైతిక ప్రోగ్రామ్స్‌ని అనుమతించడం సరికాదు. బిగ్ బాస్ లాంటి సాంసృతిక హీనమైన ప్రోగ్రామ్స్ ని చూడటం బహిష్కరించి అరికట్టాలని డిమాండ్ చేస్తున్నాం’ అని నారాయణ మరోసారి విరుచుకుపడ్డారు.