telugu navyamedia
ఆంధ్ర వార్తలు

జగన్ ప్రభుత్వానికి హైకోర్టులో షాక్..అయ్యన్నపాత్రుడికి హైకోర్టులో ఊరట..

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత , మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఇంటి గోడ కూల్చివేత కేసులో ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన ఇంటికి గోడ తిరిగి నిర్మిచుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది.

డ్రైనేజీ భూమిని ఆక్రమంచి ఇంటి గోడ నిర్మించారని పేర్కొంటూ మున్సిపల్‌ అధికారులు ఆయన ఇంటి గోడను ఇటీవల కూల్చివేసిన విషయం తెలిసిందే. దీంతో ఇంటి గోడ కూల్చివేత ప్రక్రియను నిలువరించాలని కోరుతూ అయ్యన్నపాత్రుడి కుమారులు విజయ్‌, రాజేష్‌‌లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.

దీనిపై బుధవారం జరిగిన విచారణ సందర్భంగా పిటిషనర్ల తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ వాదనలు వినిపిస్తూ.. ఆమోదం పొందిన ప్లాన్‌ ప్రకారం నిర్మాణం చేశారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

తహసీల్దార్‌, జలవనరులశాఖ అధికారులు పరిశీలించి హద్దులు నిర్ణయించాకే నిర్మించారని పీవీ సతీష్ తెలిపారు. రాజకీయ కక్షతో.. అర్ధరాత్రి సమయంలో నిబంధనలకు విరుద్ధంగా కూల్చివేతలు ప్రారంభించారని ఆయన వాదించారు. ఆ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం.. ఇంటి గోడ నిర్మించుకునేందుకు పిటిషనర్లకు అనుమతిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

Related posts