అమెరికాలో కరోనా కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టడంతో సామాజిక దూరంపై కొత్త నిబంధనలను రూపొందించే అవకాశం లభించిందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. తాజాగా శ్వేతసౌధంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ వైరస్ సోకిన కొత్త కేసుల సంఖ్య సమీప భవిష్యత్తులో మరింతగా తగ్గుతుందని భావిస్తున్నట్టు తెలిపారు. దేశంలో కరోనా గరిష్ఠ స్థాయి నుంచి దిగివచ్చిందని, అయినా వైరస్ పై పోరాటం కొనసాగుతుందన్నారు.
అమెరికాలో ఇప్పటివరకూ 6.3 లక్షల మందికి కరోనా పాజిటివ్ రాగా, బుధవారానికి దాదాపు 28 వేల మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా పాజిటివ్ రోగుల సంఖ్య పరంగాను, మరణాల పరంగానూ అమెరికాదే అగ్రస్థానం. అయితే, మరణాల సంఖ్య వేల నుంచి వందల్లోకి దిగొచ్చింది. ఈ నెల తొలి వారంతో పోలిస్తే, కొత్త కేసుల సంఖ్యా తగ్గింది. మరణాల సంఖ్యను తగ్గించేలా కృషి చేస్తామని కరోనా టాస్క్ ఫోర్స్ సభ్యుడు డాక్టర్ డెబోరా బ్రిక్స్ తెలిపారు.