ఢిల్లీలోని జేఎన్ యూ లో నిన్న రాత్రి విద్యార్థులు, అధ్యాపకులపై దుండగులు జరిపిన దాడిపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువిరుస్తున్నాయి. తాజాగా ఈ ఘటన పై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్పందించారు. ఈ రోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ.. మోదీ అండతో మూకలు రెచ్చిపోతున్నాయని ఆమె పేర్కొన్నారు. విద్యార్థుల గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. విద్యార్థులు, యువతకు తమ సంఘీభావాన్ని ప్రకటించారు.
విద్యార్థులకు ప్రయోజనకరమైన విద్య అవసరముందని ఆమె తెలిపారు. భవిష్యత్తుపై అశావహంగా ఉండి, ఉపాధి, ఉద్యోగాలు లభించే విద్య అవసరమన్నారు. అంతేకాక, ప్రజాస్వామ్యంలో ప్రత్యక్షంగా పాల్గొనేందుకు అవకాశముండాలని, మోదీ ప్రభుత్వం వారి హక్కులనుంచి దూరం చేయాలని చూస్తోందన్నారు. ప్రతిరోజు దేశంలోని క్యాంపస్, కాలేజీల్లో పోలీసులు లేదా ఇతర అసాంఘిక స్వార్థ శక్తులు దాడులకు దిగుతున్నాయని సోనియా విమర్శించారు.