కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. జూబ్లీహిల్స్ రోడ్డు నంబరు 45 సిగ్నల్ వద్ద ఆగివున్న ఆయన కారును, సినిమా షూటింగ్‌కు చెందిన వాహనం బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో పొన్నాల కారు ముందు భాగం ధ్వంసమైంది. ఆ సమయంలో కారులో పొన్నాలతోపాటు ఆయన మనవడు ఉన్నారు. వారికి ఎటువంటి ప్రమాదం వాటిల్లకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదం తర్వాత వారు మరో కారులో వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.