పోతిరెడ్డిపాడు నుంచి నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం జీవో ఇచ్చిన నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేత నాగం జనార్థన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డారు. కేసీఆర్, ఏపీ సీఎం జగన్ కుమ్మక్కయ్యారని ధ్వజమెత్తారు. ఈ క్రమంలో జగన్‌కు తమ సహకారం ఉంటుందంటూ కేసీఆర్ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను మీడియాకు చూపించారు. తెలంగాణను ఎండబెట్టడమే నీ పనా? అంటూ కేసీఆర్‌పై నాగం ఫైర్ అయ్యారు. దోకే బాజ్ పనులు ఆపండంటూ తీవ్ర వ్యాఖ్యలతో విరుచుకుపడ్డారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ రెండు రాష్ట్రాల నీటి వాడకంపై ఒక సబ్ కమిటీ వేసిందని ఈ సందర్భంగా గుర్తు చేసిన ఆయన.. పోతిరెడ్డిపాడు నుంచి 73900 క్యూసెక్కుల నీటిని ఏపీ ఇప్పటికే వినియోగించుకున్నట్లు సబ్ కమిటీ నివేదిక ఇచ్చిందని పేర్కొన్నారు. ఈ నివేదికను సీఎం కేసీఆర్ చూశారా? అని ప్రశ్నించారు.
జనవరిలో సీఎం కేసీఆర్‌కు తాను లేఖ రాసినా స్పందించలేదని దుయ్యబట్టారు. మే 5వ తేదీన మరోసారి లేఖ రాస్తే 12న స్పందించి రివ్యూచేశారని నాగం పేర్కొన్నారు. తెలంగాణకు కేటాయించిన కేటాయింపుల్లో సగం నీటిని కూడా ఉపయోగించుకోవడం లేదని ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. ప్రాజెక్టులకు దేవతల పేర్లు పెట్టి కేసీఆర్ దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు.