telugu navyamedia
తెలంగాణ వార్తలు

రాజగోపాల్ రెడ్డి గోవు లాంటి పార్టీని వ‌దిలి..పులి లాంటి పార్టీలో చేరారు..

మునుగోడు ఉప ఎన్నిక త‌మ‌కు సెమీ ఫైనల్స్ అని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత‌ ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ .. మునుగోడు ఉప ఎన్నికల అత్యధిక మెజారిటీతో గెల‌వ‌డ‌మే కాకుండా 2023 ఎన్నికల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ధీమావ్య‌క్తం చేశారు

కాంగ్రెస్ లో తామంతా తృప్తిగానే ఉన్నామని ప్రకటించారు. కాంగ్రెస్ ఎవరి సొంతం కాదని, పార్టీని నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ కంటే బీజేపీ ఏ ఒక్క మంచి చేసిందో రాజగోపాల్ రెడ్డి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ గోవు లాంటిది, బీజేపీ పులిలాంటిదని జీవ‌న్ రెడ్డి అన్నారు. పాలిచ్చే గోవును వదిలి.. పులి వద్దకు వెళ్తే ఏమవుతుంది. రాజగోపాల్‌రెడ్డి పులి మీద స్వారీ చేస్తున్నారు. పులిపై స్వారీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎప్పటికైన ప్రమాదమేనని ఆయన అభిప్రాయపడ్డారు.

ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రద్దు చేసినందుకు బీజేపీకు ఓటువేయాలా. అన్నింటి ధరలు పెంచినందుకు బీజేపీకు ఓటు వేయాలా?. తెలంగాణ ఏర్పాటును కించపరిచినందుకు ఓటు వేయాలా?. దేశంలో సైనికులకు వేతనాలు, పింఛన్లు ఇవ్వలేని దుస్థితి అని అన్నారు.

కేసీఆర్‌ పై పోరాటం కోసం బీజేపీలో చేరుతున్నట్టుగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెబుతున్నారన్నారు. అయితే ఇప్పటి వరకు కేసీఆర్ పై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఏం పోరాటం చేశారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ పై పోరాటం చేసే అవకాశాన్ని వదులుకొని ఎన్నికలకు వెళ్తున్నారని జీవన్ రెడ్డి చెప్పారు.

పేరు, ఊరూ లేని వాడు సోషల్ మీడియాలో తాను పార్టీ మారుతున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తప్పుబట్టారు. కాంగ్రెస్‌ను బలహీన పరిచే కుట్ర చేస్తున్నారని దుయ్యబట్టారు. అందుకే తాము కాంగ్రెస్ అని చెప్పుకోవాల్సి వస్తోందన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేస్తామని జీవన్‌రెడ్డి తెలిపారు.

Related posts