కాంగ్రెస్ పై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పార్టీ మార్పుపై త్వరలో స్పష్టత ఇస్తానని కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పారు. చౌటుప్పల్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌరవం లేని చోట తాను ఉండలేనని చెప్పారు. ఎవరి కింద పడితే వారి కింద పని చేయలేనని కూనడా చెప్పారు.
తాను పార్టీ మారితే తనను నమ్మిన వారు తన వెంట రావొచ్చని కూడా ఆయన చెప్పారు. క్యారెక్టర్ లేనోళ్లు, నైతిక విలువలు లేనివాళ్ల నాయకత్వం కింద తాను పనిచేయలేనని చెప్పారు.స్వార్ధం కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కాంగ్రెస్ ను వీడాలంటే కొంత బాధగానే ఉందని చెప్పారు. కార్యకర్తలకు చెప్పకుండా ఏ నిర్ణయం తీసుకోబోనని తెలిపారు.
సమస్యలపై కేసీఆర్ పై తన పోరాటం నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని ఆయన చెప్పారు. కేసీఆర్ ను గద్దె దించడం కోసమే పార్టీ మారుతానని ఆయన తేల్చి చెప్పారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా గట్టిగా పోరాటం చేసే పార్టీ ఏదైతే ఆ పార్టీలో ఉంటానని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీ గట్టిగా టీఆర్ ఎస్‌కు వ్యతిరేకంగా పోరాటం చేయడం లేదని భావిస్తే మరో పార్టీలో పోతామన్నారు. తాము పదవుల కోసం, డబ్బుల కోసం పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. కేసీఆర్ కు వ్యతిరేకంగా అవసరమైతే తామే నిలబడుతామని ఆయన చెప్పుకొచ్చారు.
మరోవైపు అసెంబ్లీ సమావేశాల ముగింపు రోజున ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి ఈ విధమైన వ్యాఖ్యలు చేయడం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది.
ఇదిలా ఉంటే రెండు రోజుల క్రితం కాంగ్రెస్ ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కలిశారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి అడిగిన వెంటనే ప్రధాని మోదీ అపాయింట్మెంట్ లభించడం ప్రాధాన్యత సంతరించుకుంది.