కాంగ్రెస్ పార్టీలో స్వెచ్ఛ ఎక్కువగా ఉంటుందని ఆ పార్టీ సీనియర్ నేత జగ్గారెడ్డి అన్నారు. ఎవరైనా ఏదైనా మాట్లాడే హక్కు కాంగ్రెస్ పార్టీలో ఉంటుందన్నారు. సర్వే సత్యనారాయణ వ్యవహారం పార్టీ అంతర్గతమైన విషయమని చెప్పారు.ఎన్నికల ముందు కార్యకర్తల్లో ఆత్మస్ధైర్యం నింపేందుకే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే గాంధీభవన్ రానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి సవాల్ చేశారని, ఇలాంటివి రాజకీయాల్లో సాధారణమని జగ్గారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో చిట్‌చాట్ నిర్వహించారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలే టీఆర్‌ఎస్ గెలుపుకు దోహదపడ్డాయని చెప్పారు. ఎలక్షన్ కమిషన్ కూడా టీఆర్‌ఎస్ గెలుపుకు సహకరించిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ పుణ్యమా అని ఎమ్మెల్యేగా గెలవాలంటే రూ.25 నుంచి రూ.30 కోట్లు ఖర్చు పెట్టాల్సి వస్తుందన్నారు. మెదక్ ఎంపీ టికెట్ తన భార్య నిర్మలకు ఇస్తే పోటీ చేసి గెలిపిస్తానన్నారు. నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన అయ్యప్ప స్వామి భక్తుల కుటుంబాలకి కాంగ్రెస్ పార్టీ పక్షాన జగ్గారెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.