telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ వార్తలు

వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం పై .. అసలు లేనట్టే.. కుదరదన్న కాంగ్రెస్ అధిష్టానం..

sonia and priyanka gandhi in raebareli

కాంగ్రెస్ అధిష్టానం ఇటీవలే ఏపీకి కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించింది, త్వరలోనే తెలంగాణలోనూ కొత్త పీసీసీ చీఫ్‌ను నియమించబోతోంది. ఈ మేరకు ఢిల్లీలో అధిష్టాన పెద్దలు కసరత్తులు చేస్తున్నారు. అయితే ఈసారి పీసీసీ చీఫ్‌తో పాటుగా వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకాన్ని చేపట్టకూడదని అధిష్టానం భావిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్లుగా ఉన్నవారినే కొనసాగిస్తారా.. లేక వారికి పూర్తిగా చెక్ పెట్టేస్తారా అన్న చర్చ జరుగుతోంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ అధిష్టానం నలుగురికి పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులు కట్టబెట్టింది. గతంలో ఎన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ చేసిన ఈ ప్రయోగం.. ఎన్నికల్లో పెద్దగా ఫలితాలను ఇవ్వలేదు. పైగా ఆ సామాజికవర్గానికి ఇచ్చారు.. ఈ సామాజికవర్గాన్ని విస్మరించారు.. అన్న విమర్శలు కూడా వినిపించాయి. దానికి తోడు నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లలో గ్రౌండ్‌లో యాక్టివ్‌గా పనిచేస్తున్నది ఒకరిద్దరు మాత్రమే.

నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం వర్కౌట్ కాకపోగా లేని తలనొప్పులు తీసుకొచ్చిందని ఏఐసీసీలో ఈ వ్యవహారాలను పర్యవేక్షించే కేసీ వేణుగోపాల్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. ఇదే విషయాన్ని ఆయన హైకమాండ్‌తో చెప్పినట్టు తెలుస్తోంది. చాంబర్ల కేటాయింపు దగ్గరి నుంచి పని విభజన వరకు అన్నీ విభేదాలే అని.. నలుగురి నియామకంతో ఒరిగిందేమీ లేదని ఆయన హైకమాండ్‌కు చెప్పినట్టు సమాచారం. నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకం కలిసిరాకపోవడంతో.. ఈసారికి అసలు వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకమే చేపట్టకూడదని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ అవసరమైతే పీసీసీ చీఫ్ నియామకం తర్వాత.. ఆయన సూచనల మేరకు దానిపై ఆలోచన చేయాలనుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు,ఈసారికి రెడ్డి సామాజికవర్గానికి కాకుండా వేరే వర్గానికి ఆ పదవిని కట్టబెట్టాలనే యోచనలో ఉన్నట్టు కూడా ప్రచారం జరుగుతోంది.

Related posts