telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

హుజూర్‌నగర్ పై .. కాంగ్రెస్ సందేహాలు..

congress-logo

టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో హుజూర్‌నగర్ బైపోల్ జరుగుతుంది. ఈ బైపోల్ ఎన్నికతో తెలంగాణలో రాజకీయ హీట్ ఒక్కసారిగా పెరిగిపోయింది. బరిలో అగ్ర పార్టీలన్నీ నిలబడటంతో.. గెలుపు ఎవరిదన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీలే కాకుండా.. బీజేపీ, టీడీపీలు కూడా ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా.. పోటీ మాత్రం కాంగ్రెస్, టీఆర్ఎస్‌ల మధ్య ఉండబోతుంది అన్నది రాజకీయ వశ్లేషకులు అభిప్రాయం. ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీకి ఎంతో ప్రతిష్టాత్మకమైనదిగా మారింది. అందుకు ముఖ్య కారణం ఇది కాంగ్రెస్ సిట్టింగ్ స్థానం కావడం. ఈ సీటు కోల్పోతే.. కాంగ్రెస్‌ పార్టీకి కోలుకోలేని దెబ్బ అవుతుంది.

గత మూడు పర్యాయాలుగా ఈ హుజూర్‌ నగర్ స్థానాన్ని కాంగ్రెస్ కైవసం చేసుకుంటూ వస్తుంది. అయితే ఈ సారి మాత్రం అధికార టీఆర్ఎస్ పార్టీ హుజూర్‌నగర్‌ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు పక్కా ప్లాన్లను రచిస్తోంది. ఈ ప్లాన్లతో కాంగ్రెస్‌ పార్టీకి గుబులుపుట్టుకుంది. అందుకు కారణం గతంలో కాంగ్రెస్ గెలిచింది కేవలం ఏడు వేల ఓట్ల తేడాతోనే. అయితే అప్పట్లో కాంగ్రెస్‌ ఒంటిరిగా గెలిచిన ఓట్లు కాదు. మహాకూటమిగా బరిలోకి దిగిన సమయంలో టీడీపీ, సీపీఐ, టీజేఎస్ పార్టీల ఓట్లు కూడా కాంగ్రెస్‌కు పడ్డాయి. అయితే ఈ సారి సీన్ రివర్స్ అయ్యింది. అప్పుడు జతకట్టిన పార్టీలు ఏవి కూడా కాంగ్రెస్‌ పక్కన లేవు. అదే సమయంలో అప్పుడు కాంగ్రెస్‌కు జై కోట్టిన కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ).. ఇప్పుడు కారెక్కుతానంటుంది. అధికారికంగా టీఆర్ఎస్ పార్టీకే మా మద్ధతు అని ప్రకటించింది. దీంతో కాంగ్రెస్‌ పార్టీకి ఇది కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు రాజకీయ విశ్లేషకులు. వీరి ఓటు బ్యాంకు స్వల్పమే.. కేవలం రెండు నుంచి మూడు వేల ఓట్లు మాత్రమే ఉన్నాయి. అయితే అవి ఏ పార్టీ గెలుపుకైనా కీలకమే.

Related posts