telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ దళిత దండోరా

ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లిలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో దళిత, గిరిజన దండోరా కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ పాలనలో ఎస్సీ, ఎస్టీల జీవితాలు చితికిపోతున్నాయని, ఆదివాసీల జీవితాలు మార్చాలనేదే కాంగ్రెస్‌ ప్రణాళిక అని అన్నారు. ఉప ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్‌కు ఎస్సీలు గుర్తుకొస్తారని, దళితబంధును రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు అమలు చేయరని ప్రశ్నించారు. రూ.4 లక్షల కోట్ల అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని అప్పులపాలు చేశారని మండిపడ్డారు. ఇంద్రవెల్లి పేరు స్మరిస్తే ఎంతో స్ఫూర్తి కలుగుతుందని అన్నారు. స్వేచ్ఛ కోసం పోరాడి, ప్రాణాలిచ్చిన నేల ఇంద్రవెల్లి అన్నారు. గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కొమురం భీమ్‌ గడ్డ ఇదేనన్నారు. నిరంకుశ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొమురం భీమ్‌ పోరాడారని గుర్తు చేశారు.

ఉమ్మడి రాష్ట్రంలో ఆదిలాబాద్‌కు అన్యాయం జరిగిందని రేవంత్‌రెడ్డి అన్నారు. అమరుల కుటుంబాలను ఆదుకునే బాధ్యత కాంగ్రెస్‌దేనని హామీ ఇచ్చారు. తెలంగాణకు దళత నేతను తొలి సీఎం చేస్తానని కేసీఆర్‌ మాట తప్పారని రేవంత్ రెడ్డి అన్నారు. దళిత ఉపముఖ్యమంత్రిని అవినీతి ఆరోపణలతో వెంటనే తొలగించారని అన్నారు. దళిత ఉప ముఖ్యమంత్రి రాజయ్య పంచె కడితే ఓర్వలేక అవినీతి ముద్రవేసి పక్కన కూర్చోబెట్టారని ఆరోపించారు. ఇప్పుడు కేబినెట్‌లో ఒక్క మాదిగకు అవకాశం ఇవ్వలేదని అన్నారు. 118 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావాలి అప్పుడే దళిత బంధు అందరికీ వస్తుందని రేవంత్ రెడ్డి అన్నారు. కాంట్రాక్టులు, కమీషన్ల ద్వారా కేసీఆర్ కుటుంబం రూ. వేల కోట్లను దోచుకుంటోందని రేవంత్ ఆరోపించారు. దళితులకు చట్ట సభల్లో రిజర్వేషన్లు తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని గుర్తుచేశారు. దేశంలో దళితులను రాష్ట్రపతితో పాటు అనేక పదవుల్లో కాంగ్రెస్‌ అవకాశమిచ్చిందని అన్నారు. రాష్ట్రంలో సీఎం పదవితో పాటు అనేక పదవులిచ్చిందని అన్నారు. రాజ్యసభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా మల్లికార్జున ఖర్గేను నిలబెట్టింది కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు.

 

 

Related posts