telugu navyamedia
సినిమా వార్తలు

ద గ్రేట్ జర్నలిస్ట్, కవి, రచయిత, దర్శకుడు భగీరథ గారికి అభినందనలు..

భగీరథ గారు నాకు ఆప్తులు , వారు ఈరోజు ఉగాది సినిమా పురస్కారాన్ని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా భగీరథ గారి వ్యక్తిత్వం నాకు బాగా వచ్చింది . జర్నలిజానికే వన్నె తెచ్చిన ఆయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం.1971లో భగీరథ తన 15వ ఏట ఇంటర్మీడియేట్ చదవడానికి హైదరాబాద్ వచ్చారు . ఆ సంవత్సరం నుంచే నుంచి రచనలు చేయడం మొదలు పెట్టారు . 

1974లో భగీరథ తన 18వ ఏట వ్రాసిన “ఆహుతి ” అన్న నాటకాన్ని ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వారు ఎంపిక చేశారు . ఈ నాటకం 1975 జనవరి 15 మరియు 30న రెండు భాగాలుగా ప్రసారం అయ్యింది.

1977లో “వెండితెర ” సినిమా పత్రిక తో పాత్రికేయ జీవితాన్ని ప్రారంభించారు . ఆ తరువాత ఆంధ్ర జ్యోతి నుంచి వెలువడే జ్యోతి చిత్రలో హైదరాబాద్ రిపోర్టర్ గా పనిచేశారు .


1980లో “మానవత’ పేరుతో రాసిన కవితా సంపుటికి మహాకవి శ్రీశ్రీ ముందుమాట వ్రాసి , మద్రాస్ నుంచి హైదరాబాద్ వచ్చి స్వయంగా ఆవిష్కరించారు . ఆ సభకు అప్పటి హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆవుల సాంబశివరావు అధ్యక్షత వహించారు . అది భగీరథ సాహిత్య జీవితానికి బలమైన పునాది వేసింది .

1983 జనవరి 9న ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా నందమూరి తారక రామారావు పదవీ బాధ్యతలు చెప్పట్టారు . ఫిబ్రవరిలో ముఖ్యమంత్రి రామారావు గారు భగీరధను అల్పాహారానికి ఆహ్వానించి ఇంటర్వ్యూ ఇచ్చారు .

1992లో మొదటి సారి సినీగోయర్స్ నుంచి అవార్డు స్వీకరించారు . అప్పటి కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి బంగారప్ప ఈ అవార్డుకు బహుకరించారు .
అదే సంవత్సరం రామ్ గోపాల్ వర్మ “అంతం “, “ద్రోహి ” చిత్రాల షూటింగ్ షూటింగ్ శ్రీలంక లో జరిగినప్పుడు భగీరధను ప్రత్యేక అతిధిగా ఆహ్వానించారు .
1997లో ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఆ సంవత్సరం ఉత్తమ జర్నలిస్టుగా ఎంపిక చేసి నంది అవార్డు తో సత్కరించింది .

Congratulations to The Great Journalist, Poet, Writer and Director Bhagiratha Garu

ఆంధ్ర ప్రభ లో పని చేస్తున్నప్పుడు, ఎడిటర్ వాసుదేవ దీక్షితుల ప్రోత్సాహంతో 68 సంవత్సరాల తెలుగు సినిమాపై”మోహిని ” పేరుతో రెండు భాగాలతో అద్భుతమైన పుస్తకాన్ని ప్రచురించారు .

1996లో “ప్రియమైన శ్రీవారు ” సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా 2005లో “సామాన్యుడు” 2007లో “స్వాగతం ” సినిమాలకు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ గా పనిచేశారు . 2010లో భగీరథ రచించిన కథ తో “నజరానా ‘అన్న బాలల చిత్రం రూపొందింది . దీనికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నుంచి బంగారు నంది అవార్డు లభించింది .

2010లో డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వ విద్యాలయం లో ఎమ్మె రెండవ సంవత్సరం చదివే విద్యార్థులకు కోసం భగీరథ తెలుగు సినిమాపై ఒక పాఠం రచించారు . తెలుగు సినిమా గురించి విశ్వ విద్యాలయ స్థాయిలో ఒక పాఠం రావడం ఇదే మొదటిసారి.


2014లో వంగూరి చిట్టెన్ రాజు గారు అమెరికా లోని హ్యూస్టన్ లో జరిగిన 9వ తెలుగు సాహిత్య సదస్సు మరియు 50 సంవత్సరాల అమెరికా కథ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడానికి భగీరథను ఆహ్వానించారు . అక్టోబర్ 25, 26 తేదీల్లో జరిగిన సదస్సులో భగీరథ ” మధ్య యుగాలనాటి దక్షిణ భారత దేశ చరిత్ర ” గురించి మాట్లాడారు. ఈ ప్రసంగం అక్కడివారికి ఎంతో స్ఫూర్తి నిచ్చింది .

2017లో భగీరథ 64వ జాతీయ సినిమా అవార్డుల కమిటీ సభ్యుడుగా పనిచేశారు .ఇది దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జాతీయ సినిమా అవార్డుల కమిటీ . 2021లో ప్రతిష్ఠాత్మకమైన ఆస్కార్ అవార్డు ఇండియన్ జ్యూరీ సభ్యుడుగా పనిచేశారు .


ఇక భగీరథ నాలుగు పర్యాయాలు నంది అవార్డుల కమిటీలలోను , అనేక ప్రైవేట్ అవార్డుల కమిటీల్లోనూ , , దూరదర్శన్ స్క్రిప్ట్ మరియు స్క్రీనింగ్ కమిటీ , తెలుగు విశ్వవిద్యాలయంలో అవార్డు పుస్తకాల ఎంపిక కమిటీ , డాక్టర్ బి .ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం పాఠ్యాంశాల సలహా మండలి, హైదరాబాద్ ప్రాంతీయ సెన్సార్ బోర్డు సభ్యుడుగా మూడు పర్యాయాలు పనిచేశారు.

ఉత్తమ జర్నలిస్టుగా భగీరధకు రెండు పర్యాయాలు రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డులు , రెండు పర్యాయాలు వంశీ , కిన్నెర , రెండు పర్యాయాలు సినీ గోయర్ ,ఢిల్లీ తెలుగు అకాడమీ, ఎన్ .టి .ఆర్ ట్రస్ట్, శృతిలయ ఆర్ట్స్ అకాడమీ, మానస ఆర్ట్ అకాడమీ, అక్కినేని జీవిత సాఫల్య పురస్కారం , భారత్ ఆర్ట్స్ ,ప్రజాడైరీ , యువకళావాహిని ,100 సంవత్సరాల తెలుగు సినిమా ఉత్సవాలు ,ఫిలిం నగర్ దైవ సన్నిధానం, పి .ఎస్ .ఆర్ పురస్కారం ,డెక్కన్ ఉడ్ జీవిత సాఫల్యం లభించాయి .

2017లో మిత్రులు కాకాని బ్రహ్మం , నర్రా వెంకటరావు , కుమార్, రఘునాథ్ బాబు తో కలసి నవ్య మీడియా వెబ్ సైట్ ను ప్రారంభించారు21వ అవార్డును ఉగాది పర్వదిన వేడుకలలో స్వీకరించబోతున్నారు. నాటి భగీరథుడు బోళా శంకరుని కృపతో పవిత్రమైన
గంగమ్మతల్లిని ప్రవహింపజేసి భువిని పునీతం చేసినట్లుగా…నేటి మన భగీరథుడు తన అమృత కలంతో పవిత్ర గంగాసమానమైన రచనా ప్రవాహం సృష్టించి జర్నలిజాన్ని పునీతం చేశారు.ఈరోజు ఉత్తమ జర్నలిస్టు అవార్డు స్వీకరిస్తున్న సందర్భంగా భగీరథగారికి శత సహస్ర శుభాభినందనలు.

డాకోజు శివ ప్రసాద్,
ఆర్టిస్ట్

Related posts