telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమస్యలు తెలిపేందుకు.. ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు .. : తలసాని

complaint boxes in constitution said talasani

పశుసంవర్ధకశాఖమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ .. నియోజక వర్గం ప్రజలు తమ సమస్యలు తెలియజేసేందుకు పలు ప్రాంతాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటు చేస్తామని అన్నారు. శనివారం తన నియోజక వర్గమైన సనత్‌నగర్‌ పరిధిలోని బన్సీలాల్‌పేట డివిజన్‌ పరిధిలోని పద్మారావు నగర్‌లో ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భారీఎత్తున స్పందన లభించింది కాలనీల సంఘాలు, అపార్ట్‌మెంట్‌వాసులు, బస్తీవాసులు, వ్యాపార వర్గాలు వచ్చి తమ సమస్యలను వెల్లడించారు. కొన్ని సమస్యలను తక్షణం పరిష్కరించాలన్న లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసినట్టు మంత్రి తలసాని తెలిపారు. ఈ కార్యక్రమానికి విద్యుత్‌, వాటర్‌బోర్డు, జీహెచ్‌ఎంసి, హెచ్‌ఎండి, పోలీస్‌, రెవెన్యూ తదితర శాఖల నుంచి ఉన్నత అధికారులు హాజరయ్యారు. కొన్ని చిన్న సమస్యలు అప్పటికప్పుడే ఉన్నతాధికారుల సమక్షంలో పరిష్కరించేందుకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఆయా శాఖల అధికారులతో పునః సమీక్ష జరుపుతామని మంత్రి వెల్లడించారు. ప్రధానంగా కాలనీల్లోరోడ్లపైనే వాహనాలుపార్కింగ్‌చేస్తున్నారని, దీని వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్టు వివిధ కాలనీ వాసులు పేర్కొన్నారు. పలు ప్రాంతాల్లో పారిశుద్ద్య సమస్యలు, విద్యుత్‌సమస్యలు, ట్రాఫిక్‌, స్పీడ్‌ బ్రేకర్ల నిర్మాణం. తాగునీటి సమస్యలు, పెన్షన్‌ వంటి వాటిని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. నియోజక వర్గం ప్రజలు తమ సమస్యలపై నేరుగా తనను కలవ వచ్చని అలా కుదరని పక్షంలో నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో ఫిర్యాదుల బాక్సులు ఏర్పాటుచేస్తామని ఎవరైనా నేరుగా తమ ఫిర్యాదుల చిట్టీని బాక్స్‌లలో వేయవచ్చని నిర్ణీత సమయంలో బాక్స్‌లు తెరిచి ఫిర్యాదులపై తగిన రీతిన స్పందిస్తామని అన్నారు.

Related posts