telugu navyamedia
వ్యాపార వార్తలు

బొగ్గు కొరతపై కేంద్ర ప్రభుత్వం ప్రకటన

దేశంలో విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. బొగ్గు కొరత కారణంగా దేశవ్యాప్తంగా విద్యుత్‌ సంక్షోభం ముంచుకురాబోతోందన్న హెచ్చరికల నేపథ్యంలో బొగ్గు సరఫరాను పెంచినట్లు కేంద్ర ప్రభుత్వ సంస్థ కోల్‌ ఇండియా లిమిటెడ్‌ సోమవారం వెల్లడించింది. గత నాలుగు రోజులుగా విద్యుత్ కేంద్రాలకు రోజుకి 1.51 మిలియన్ టన్నులు సరఫరా చేస్తునట్లు వెల్లడించింది. అలాగే సరఫరాను మరింత వేగవంతం చేసేందుకు కావాల్సిన రవాణా సదుపాయాల్ని పునరుద్ధరిస్తున్నట్లు పేర్కొంది.

బొగ్గు గనుల వద్ద ప్రస్తుతం 40 మిలియన్‌ టన్నుల తవ్విన నిల్వలు ఉన్నాయని తెలిపింది. బొగ్గు లభ్యత విషయంలో ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని స్పస్టం చేసింది. అక్టోబర్‌లో బొగ్గు వెలికితీతను సైతం పెంచినట్లు సీఐఎల్‌ తెలిపింది. రోజుకు సగటున 1.73 మిలియన్‌ టన్నుల బొగ్గునువెలికి తీస్తున్నట్లు ప్రకటించింది. పండగ సెలవుల తర్వాత కార్మికుల సంఖ్య పెరుగుతుందని బొగ్గు వెలికితీత మరింత ఊపందుకుంటుందని పేర్కొంది.

ప్రస్తుతం దేశవ్యాప్తంగా థర్మల్‌ విద్యుత్‌ కర్మాగారాల్లో 72 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఉన్నాయని.. అవి 4 రోజుల ఉత్పత్తికి సరిపోతాయని కేంద్రం ఆదివారం తెలిపిన విషయం తెలిసిందే. అనవసర భయాందోళనలు వద్దంటూ ప్రకటన విడుదల చేసింది.

Related posts