telugu navyamedia
ఆంధ్ర వార్తలు

అక్కచెల్లెమ్మలకు మంచి చేయ‌డ‌మే మా ప్ర‌భుత్వం ఉద్దేశం..

*విజ‌య‌వాడ‌లో తల్లీ బిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలు ప్రారంభించిన జగన్

*అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి..

*బిడ్డ‌కు జ‌న్మ‌నించేవ‌ర‌కు అన్నీ చూసుకుంటాం..
*ప్రభుత్వ ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తాం..

గర్భిణులు, బాలింతల కోసం రూపొందించిన ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. విజయవాడలోని బెంజ్‌ సర్కిల్‌ వేదికగా శుక్రవారం సీఎం జగన్ జెండా ఊపి ఈ వాహనాలను ప్రారంభించారు.

ప్రభుత్వాస్పత్రిలో ప్రసవానంతరం తల్లీబిడ్డను సురక్షితంగా, సౌకర్యవంతంగా ఇంటికి చేర్చే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇందుకోసం 500 ‘డాక్టర్‌ వైఎస్సార్‌ తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్‌’ వాహనాలను ప్రారంభించారు. అరకొరగా ఉన్న పాత వాహనాల స్థానంలో 500 కొత్త వాహనాలను ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. అక్కచెల్లెమ్మల కోసం అత్యాధునిక వాహనాలను అందుబాటులోకి తెచ్చినట్లుగా ప్రకటించారు. తల్లీ బిడ్డకు ఈ వాహనాలు శ్రీరామరక్ష అని ఆయన పేర్కొన్నారు. ఆసుపత్రుల్లో నాణ్యమైన సేవలు అందించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకొంటుందని సీఎం చెప్పారు. దేవుడి దయతో ఇవాళ మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నామన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించిన మేరకు ఆసుపత్రుల్లో గర్భిణులు, బాలింతలకు మందులు అందిస్తున్నామన్నారు సీఎం జగన్. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయి ఇంటికి వెళ్లే సమయంలో సిజేరియన్ చేసుకొన్న మహిళకు రూ. 2500, సాధారణ ప్రసవం అయిన మహిళకు రూ. 5వేలు అందిస్తున్నామన్నారు.

గత ప్రభుత్వ హయంలో వాహనాలు అరకొరగా ఉండేవి, వసతులు కూడా సరిగా ఉండేవి కావన్నారు. 104, 108, తల్లీ బిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిన విషయాన్ని సీఎం గుర్తు చేశారు.

Related posts