telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ వార్తలు

పరిపాలనను క్రికెట్‌తో పోల్చిన ఏపీ సీఎం జగన్‌…!

cm Jagan tirumala

సెక్రటేరియట్‌లో వివిధ శాఖల కార్యదర్శులతో సీఎం వైయస్‌.జగన్‌ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. క్రికెట్‌లో కెప్టెన్‌ మాత్రమే గెలవలేడు, జట్టు సభ్యులందరూ కలిసి ఆడితేనే గెలుస్తామని అన్నారు సీఎం జగన్‌. 20 నెలల కాలం గడిచింది.. ఇప్పుడు క్రికెట్‌లో మాదిరిగా మిడిల్‌ ఓవర్ల కాలం వచ్చిందని.. అలాగే మీ అందరి సహకారంతో మనం ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. అనేక విప్లవాత్మకమైన నిర్ణయాలు, మార్పులు తీసుకొచ్చామని.. దిశ చట్టం దగ్గరనుంచి, గ్రామ, వార్డు సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థ ఇలా చూస్తే… ఈ జాబితాలో చాలానే ఉన్నాయన్నారు. మనం ఖర్చును కూడా తగ్గించుకుంటున్నామని.. విద్యుత్‌ కొనుగోళ్లు లాంటి అంశాల లోతుల్లోకి వెళ్లి డబ్బును ఆదా చేయగలిగామని..దీన్ని కేంద్రం కూడా ప్రశంసించిందని పేర్కొన్నారు.
జ్యుడిషయల్‌ప్రివ్యూ ద్వారా టెండర్లలో అవినీతిని రూపుమాపుతున్నామని.. రివర్స్‌ టెండరింగ్‌ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. ఇంగ్లిషు మీడియం స్కూళ్లు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, భూముల రీసర్వే… గతంలో ఎప్పుడూ చేయనివి చేస్తున్నామని.. నేరుగా నగదు బదిలీద్వారా పథకాలు అందిస్తున్నామని తెలిపారు. 90వేల కోట్లను బటన్‌నొక్కి అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఖాతాల్లో వేయగలిగామని.. ఆరోగ్యం, విద్యలో అనేక చర్యలు తీసుకున్నామని వెల్లడించారు. 30 లక్షలకుపైగా ఇళ్లపట్టాలను ఇచ్చామని.. 20 నెలల కాలంలో అనేక కలల్ని నిజం చేశామన్నారు. అధికార యంత్రాంగం మనసుపెట్టి పనిచేసి…. ఈ పనులు చేయగలిగిందని.. ఈ సమయంలో మనం మళ్లీ మన దృష్టిని కేంద్రీకరించుకోవాల్సి ఉందని సూచించారు. శాఖల మధ్య సమన్వయం సాధించాలని.. వీటన్నింటిమీద మనం దృష్టిసారించాలన్నారు. ఇలాంటి సమావేశం పెట్టినందుకు సీఎస్‌ను అభినందిస్తున్నానని.. ఇలాంటి సమావేశాలు సమాచారలోపాన్ని నివారించడానికి కూడా తోడ్పడతాయని పేర్కొన్నారు. మేనిఫెస్టో అంటే భారీగా పేజీలు, లెక్కలేనన్ని హామీలు.. ఎన్నికలు ముగిశాక అది ఎవ్వరికీ పట్టని వ్యవహారంగా ఉండేదని.. కాని ఇప్పుడు అలా కాదు కేవలం నాలుగు పేజీల్లో మేం ఏం చేస్తామో చెప్పామన్నారు. దానికి కట్టుబడి కార్యక్రమాలు నిర్వహించామని… మేనిఫెస్టోలో 95శాతం అంశాలు అమలులో ఉన్నాయని తెలిపారు.

Related posts